Dhanu Sankranti 2024 : సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. డిసెంబర్ నెలలో సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సురాశి లోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ఏర్పడే ధను సంక్రాంతి రోజు చేయాల్సిన పుణ్యకార్యాలు, స్నాన దాన జపాదులను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ధను సంక్రాంతి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం, డిసెంబర్ 15వ తేదీన అంటే ఆదివారం రాత్రి 10 గంటల 10 నిమిషాలకు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుస్సంక్రమణం ఏర్పడుతుంది. ప్రతినెలా సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పటికీ ఇందులో ముఖ్యంగా తులా రాశి, ధనుస్సు రాశి, మకర రాశి సంక్రమణాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ధను సంక్రాంతి హిందూ పురాణాల ప్రకారం ఒక శుభదినం. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది.
ధనుర్మాసం
ధనుస్సంక్రమణం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుడే ధనుర్మాసం ప్రాత:కాలంలా పవిత్రమైంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత విశిష్టమైనది. ధనుస్సంక్రమణం శుభదినం రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఎలాంటి దానాలు చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ధను సంక్రాంతి రోజు పాటించాల్సిన ఆచారాలు
- ధనుసంక్రాంతి రోజు నదీస్నానం పరమోత్తమం అని శాస్త్రం చెబుతోంది.
- ఈ రోజు నదీస్నానం చేసిన తర్వాత పసుపు కలిపిన నీటితో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది.
- పసుపు రంగు పూలతో సూర్యభగవానుని పూజిస్తూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పారాయణ చేయాలి.
ఈ దానాలు శ్రేష్ఠం
వ్యాస మహర్షి రచించిన దేవి పురాణం ప్రకారం ధనుస్సంక్రమణం వేళ పూర్వీకులను స్మరించుకుంటూ దానధర్మాలు, శ్రాద్ధాలు, తర్పణాలు చేయాలి. ధనుస్సంక్రమణం రోజున పుణ్య స్నానం చేసిన వ్యక్తికి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. ధనుస్సంక్రమణం రోజు బ్రాహ్మణులకు అన్నదానం, గోదానం, భూదానం వంటివి చేయడం వలన ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అలాగే పేదలకు, ఆహారం, బట్టలు, దానం చేయడం శుభ ప్రదంగా పరిగణించబడుతుంది.
ఒడిశాలో ఇలా!
ధనుస్సంక్రాంతి ఒడిశాలో విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజు ఒరిస్సాలో జగన్నాథుని ప్రత్యేకంగా పూజిస్తారు. జగన్నాథస్వామికి ఈ రోజు రకరకాల ప్రసాదాలు నివేదిస్తారు. ఈ ఉత్సవాన్ని చూడటానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు విశేషంగా తరలి వస్తారు. ఇంతటి ప్రసిద్ధి చెందిన ధనుస్సంక్రమణం రోజు మనం కూడా స్నాన, దాన, జపాదులతో సూర్యుని పూజిద్దాం. ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. ఓం శ్రీ ఆదిత్యాయ నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.