Sri Rama Navami 2024 : లోక కల్యాణంగా భావించే శ్రీ సీతారాముల కల్యాణ వేడుక కోసం దేశంలోని రామాలయాలన్నీ సిద్ధమయ్యాయి. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ కల్యాణాన్ని కనులారా తిలకించేందుకు భక్తకోటి వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఇంకా భక్తులు ఆ జానకీ రాముడికి ఇష్టమైన బెల్లం పానకం, వడపప్పు వంటి వివిధ రకాల నైవేద్యాలను సిద్ధం చేస్తున్నారు.
శ్రీరామనవమి రోజున నియమనిష్టలతో ఆ రాముల వారిని పూజిచండం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగి, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. సాయంత్రం ఎంతో ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే.. చాలా మంది శ్రీరామనవమి రోజున తమ ఇంటిపైన హనుమంతుడి జెండా ఎగరవేస్తారు. మరి.. ఇలా శ్రీరామనవమి రోజున ఎందుకు హనుమాన్ జెండా ఎగరేస్తారో మీకు తెలుసా? దీని వెనకున్న కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమంతుడి జెండా ఇంటిపై ఉంటే అంతా శుభం కలుగుతుంది!
హనుమంతుడు శ్రీరాముడికి వీర భక్తుడు. రావణాసురుడు సీతమ్మను లంకలో బంధించినప్పుడు హనుమంతుడి ద్వారానే ఆ శ్రీరాముడు సీతమ్మ జాడను కనుగొన్నాడని అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రావణాసురుడిని సంహరించడంలోనూ హనుమంతుడు తనవంతు పాత్ర పోషించాడు. ఇవేకాకుండా.. ఇంకా పలు కారణాలతో ఆంజనేయుడిపై శ్రీరాముడికి వల్లమాలిన ప్రేమ ఉంది. అందుకే.. శ్రీరామనవమి రోజున తన భక్తులు హనుమంతుడిని పూజిస్తే ఆ జానకీ రాముడు ఎంతో సంతోషిస్తాడట.
ఇక, హనుమంతుడిని శ్రీరామనవమి రోజున పూజించడం వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని భక్తుల నమ్మకం. ఇంట్లో ఎలాంటి కలహాలూ, గొడవలు జరగవని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున ఇంటిపై కాషాయం జెండాను ఎగరవేయడం వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ విజయం కలుగుతుందని తెలియజేస్తున్నారు. ఇంకా ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావాలు కలగకుండా ఆంజనేయస్వామి చూసుకుంటాడని చెబుతున్నారు. అందుకే చాలా మంది శ్రీరామనవమి రోజున ఇంటిపై కాషాయం జెండాను ఎగరవేస్తారని పండితులు అంటున్నారు.
శ్రీరామనవమి రోజున ఇలా చేయండి..
- ఈ రోజంతా రామనామస్మరణ చేస్తూ, రామకోటి రాస్తే అంతా మంచే జరుగుతుంది.
- ఉపవాసం ఉండటం వల్ల ఆ సీతారాముల ఆశీస్సులతో పాటు, హనుమంతుడి అండదండలు కూడా ఎల్లప్పుడూ మీపైన ఉంటాయని పండితులు చెబుతున్నారు.
- రామాలయాల్లో జరిగే కల్యాణ వేడుకల్లో పాల్గొనండి.
- ఇంకా మద్యపానం, స్మోకింగ్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.
- శ్రీరామనవమి రోజున ఎవరూ కూడా అబద్ధాలు ఆడకూడదు.
- ఇలా చేయడం వల్ల ఆ జానకీ రాముడికి కోపం వస్తుందని పండితులు చెబుతున్నారు.
- కాబట్టి, ఎంతో నియమనిష్టలు పాటిస్తూ శ్రీరామనవమి పండగను జరుపుకోండి.