Significance Of Vaishno Devi Temple : భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ప్రాంతానికి ఒక్కో విశిష్టత ఉంది. ప్రపంచానికే సంస్కృతీ, సంప్రదాయాలను నేర్పించిన ఘనత భారత దేశానిది. మన దేశంలో ఎన్నో ఆలయాలు మన దేశ చరిత్రకు, భారతీయుల భక్తి భావాలకు అద్దం పట్టేలా నిలిచాయి. అలాంటి వాటిల్లో కాట్రాలో వెలసిన వైష్ణో దేవి ఆలయం కూడా ఒకటి. శక్తిపీఠంగా విరాజిల్లే ఈ ఆలయంలో వైష్ణోదేవిని దర్శించుకున్న వారికి మోక్షమార్గాలు తెరుచుకుంటాయని విశ్వాసం.
వైష్ణో దేవి ఆలయం ఎక్కడ ఉంది?
జమ్ముకశ్మీర్‌లోని కాట్రాకు సమీపంలో వైష్ణోదేవి ఆలయం ఉంది. రుగ్వేద కాలం నాటిదిగా భావించే ఈ ఆలయం సముద్ర మట్టం నుంచి 5,300 అడుగుల ఎత్తు ఉన్న త్రికూట పర్వత శ్రేణులపై మంచుకొండల మధ్య ఉంటుంది.
ఆలయ స్థల పురాణం
Vaishno Devi Birth Story : దక్షిణభారతంలో రత్నాకరుడు అనే దుర్గా దేవి భక్తుడు ఉండేవాడు. రత్నాకరుడు అతని భార్య నిరంతరం దుర్గా మాతను కొలుస్తూ ఉండేవారు. సంతానం కోసం ప్రార్దించిన ఆ దంపతులకు సాక్షాత్తూ అమ్మవారే వారికి కూతురుగా జన్మిస్తుంది. లక్ష్మీ, సరస్వతీ, పార్వతి ముగ్గురు కలిసిన స్వరూపమే వైష్ణోదేవి. ఆ దంపతులు ఆ బాలికకు వైష్ణవి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకునేవారు.
రామ దర్శనం కోసం తపస్సు
వైష్ణవి చిన్ననాటి అన్ని విషయాల్లో ఎంతో చురుగ్గా ఉండేది. శ్రీరామునిపై అచంచల భక్తి విశ్వాసాలతో రాముని కళ్లారా చూడాలని తపిస్తూ అరణ్యంలోకి వెళ్లి తపస్సు చేయసాగింది. తొమ్మిది సంవత్సరాల వయసులో వైష్ణవికి శ్రీరాముని దర్శనం కలుగుతుంది. శ్రీరాముని చూసిన తర్వాత వైష్ణవి అతడిని వివాహం చేసుకొమ్మని కోరుతుంది. అప్పుడు శ్రీరాముడు తాను ఏకపత్నీ వ్రతుడనని, ఈ జన్మకు సాధ్యం కాదని చెప్తాడు. అయినా కొన్ని సంవత్సరాల తర్వాత తాను ఇక్కడికి వచ్చినప్పుడు తనను గుర్తు పడితే తప్పకుండా వివాహం చేసుకుంటానని చెబుతాడు శ్రీరాముడు.
త్రికూట పర్వతానికి చేరుకున్న వైష్ణవి
వైష్ణవి త్రికూట పర్వతం చేరుకొని వైష్ణో దేవిగా తపస్సు చేసుకోసాగింది. ఆ ప్రాంతంలో ఉన్న వారికి ధర్మం, సత్య మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత గురించి బోధించి సాగింది. నానాటికి వైష్ణోదేవి ప్రతిభ, తపః శక్తి ఆ ప్రాంతాల్లో వ్యాపించ సాగాయి. అది చూసి ఆ ప్రాంతంలో ఉన్న ఘోరకనాధ్ అనే బాబా సహించలేకపోయాడు. ఎలాగైనా వైష్ణో దేవిని అక్కడ లేకుండా చేయాలని అనుకొని తన శిష్యుడైన భైరవనాథ్‌ను ఆజ్ఞాపిస్తాడు.
భైరవనాథ్ ఆగడాలు
భైరవనాథ్ వైష్ణోదేవి గురించి తెలుసుకోవడానికి వచ్చి అతి త్వరలోనే ఆమె సామాన్యురాలు కాదని, మహా తపస్వి అని గ్రహించాడు. ఒకరోజు అరణ్యంలో ఒంటరిగా తపస్సు చేసుకొంటున్న వైష్ణోదేవి ముందు భైరవనాధ్ నిలబడి తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. అందుకు వ్యతిరేకించిన వైష్ణోదేవి తపస్సుకు ఆటంకాలు కలిగించసాగాడు.
గుహలో తపస్సు - హనుమ రక్షణ
ఇక అప్పటి నుంచి వైష్ణోదేవి త్రికూట పర్వతంలోని ఒక గుహలో తపస్సు చేసుకోవడానికి నిశ్చయించుకుంది. హనుమంతుని ప్రార్ధించి భైరవనాథ్ తన తపస్సుకు ఆటంకం కలిగించకుండా గుహ బయట రక్షణగా ఉండమంది. తొమ్మిది నెలలపాటు వైష్ణోదేవి గుహలో తపస్సు చేసిన కాలంలో ఎన్నో సార్లు భైరవనాథ్ ఆమె తపస్సుకు భంగం కలిగించాలని ప్రయత్నించగా హనుమంతుడు భైరవనాథ్‌ను అడ్డుకున్నాడు. వారిద్దరి మధ్య తొమ్మిది నెలలు యుద్ధం జరిగింది.
భైరవనాథ్ సంహారం
Vaishno Devi Temple Jammu : చివరకు వైష్ణోదేవి తపస్సు పూర్తి చేసుకొని గుహ బయటకు వచ్చి హనుమకు భైరవనాథ్‌కు హనుమంతుడికి జరుగుతున్న యుద్ధాన్ని చూసి కాళీమాత స్వరూపంతో భైరవనాథ్ శిరస్సును ఖండించింది. ఆ దెబ్బకు భైరవనాథ్ శిరస్సు దూరంగా వెళ్లి పడింది. అప్పుడు భైరవనాథ్ అమ్మవారిని ఈ మొండి శరీరంతో బ్రతకలేనని మోక్షాన్ని ఇమ్మని వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు ఎంతో దయతో భైరవనాథ్ శిరస్సు పడిన చోట ఆలయం ఏర్పడుతుందని, వైష్ణోదేవి యాత్రకు వచ్చినవారు భైరవనాథ్ దర్శనం చేసుకోకపోతే ఆ యాత్ర వలన ఫలితం ఉండదని, ఆ యాత్ర అసంపూర్ణం అవుతుందని వరమిస్తుంది.
శ్రీరాముని ఆగమనం
ఇచ్చిన మాట ప్రకారం త్రేతాయుగం చివరలో శ్రీరాముడు ఓ వృద్ధుని రూపంలో త్రికూట పర్వత ప్రాంతానికి వెళ్తాడు. వైష్ణోదేవి వృద్ధుని రూపంలో ఉన్న శ్రీరాముని గుర్తించలేక పోతుంది. అప్పుడు శ్రీరాముడు ఈ జన్మకు ఇంక నీకు నాకు వివాహం కుదరదు. కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మ సంస్థాపనకు నేను కల్కి అవతారం స్వీకరిస్తాను. అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని చేప్తాడు. అందుకే వైష్ణో దేవి ఇప్పటికీ శ్రీరాముడు కల్కి అవతారంలో వచ్చి తనను వివాహం చేసుకుంటాడని ఎదురుచూస్తూ ఉందని అంటారు.
స్వయంభువుగా వైష్ణో దేవి
వైష్ణో దేవి భైరవనాథ్‌ను సంహరించిన తర్వాత ఇక్కడ వైష్ణోదేవి రూపంలో స్వయంభువుగా వెలసినట్లుగా తెలుస్తోంది. వైష్ణో దేవి అంటే మహాంకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి దేవతలకు ప్రతి రూపాలుగా భావిస్తారు. ఈ పవిత్ర ఆలయం భారత్‌లోని మిగిలిన అమ్మవారి స్థలాల కంటే మిక్కిలి పవిత్రంగా భావిస్తారు.
18 రోజుల్లో విజయం
పురాణాల ప్రకారం మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పాండవులను ఈ ఆలయాన్ని దర్శించమని చెప్పాడని, శ్రీకృష్ణుని ఆదేశం మేరకు పాండవులు మహాభారత సంగ్రామానికి ముందు ఈ ఆలయాన్ని దర్శించడం వల్లనే 18 రోజుల్లో విజయం సాధించారని స్థలపురాణం.
పాండవ నిర్మిత దేవాలయం
స్థలపురాణం ప్రకారం పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయం నిర్మించారని తెలుస్తుంది. త్రికూట పర్వతానికి పక్కన ఐదు రాతి కట్టడాలు ఉన్నాయి. వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక ప్రజలు భావిస్తారు.
వైష్ణో దేవి దర్శనం ఎన్నో జన్మల పుణ్యం
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప వైష్ణో దేవి దర్శనం దొరకదని అంటారు. ఎందుకంటే ఈ యాత్ర చేయడం చాలా కష్టం. గర్భగుడికి చేరుకోవాలంటే గుహల్లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రతి ఏటా ఎనభై లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. తిరుమల తిరుపతి తరువాత ఆ స్థాయిలో భక్తులు సందర్శించే రెండో పుణ్యక్షేత్రంగా వైష్ణోదేవి ఆలయానికి పేరుంది.
ఇలా చేరుకోవాలి!
Vaishno Devi Temple Route Map : కాట్రాకు సమీపంలో ఉన్న జమ్ము విమానాశ్రయం ఉంది. జమ్ము నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రాకు రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది. త్రికూట పర్వతం మీదికి వెళ్లడానికి కాలి నడకలో చేరుకోవాలి. గుర్రాల మీద వెళ్లే వీలు కూడా ఉంది. అలా వెళ్లలేని వారికి హెలికాప్టర్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి దర్శించినంత మాత్రాన్నే సమస్త పాపాలు పోయి, అష్టైశ్వర్యాలు కలిగించే వైష్ణోదేవి యాత్ర జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా చేయాలి.
యాత్రకు వెళ్లే వారికి సూచనలు
వైష్ణోదేవి యాత్రకు వెళ్లే వారు ఇవి తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆలయంలోనికి మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించరు. లెదర్ వస్తువులను కూడా అనుమతించరు. అంటే జంతు చర్మాలతో చేసిన పర్సులు, బ్యాగులు, బెల్టులు వంటివి. నడక మార్గంలో వెళ్లే భక్తులకు దారంతా మంచినీరు, ఆహార పదార్థాలు దొరుకుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం! ఈ పాటికే చాలామంది వైష్ణో దేవి యాత్రలో ఉన్నారు. మనం కూడా యాత్రకు బయల్దేరుదాం. అమ్మవారి దర్శనంతో సకల సౌభాగ్యాలను పొందుదాం. జై మాతా దీ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.