Significance Of Lord Rama Coronation : శ్రీరాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం ముగించుకుని అయోధ్యకు వస్తున్నాడన్న వార్త తెలియగానే అయోధ్య వాసులు ఆనందంగా శ్రీరామునికి స్వాగతం పలకడానికి నంది గ్రామానికి తరలి వెళ్లారు.
భరతుని భక్తిప్రపత్తులు
శ్రీరాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరుగుపరుగున వెళ్లి అన్నగారికి పాదుకలు తొడుగుతాడు. ఈ దృశ్యం చూసిన సుగ్రీవునికి, విభీషణుడికి కన్నుల వెంట ఆనందభాష్పాలు కారుతాయి. ఆ సమయంలో భరతుడు సుగ్రీవుని కౌగిలించుకొని ఇప్పటివరకు మేము నలుగురం అన్నదమ్ములం కానీ ఈనాటి నుంచి మనం ఐదుగురు అన్నదమ్ములం అని ఆప్యాయంగా పలుకుతాడు.
భరతుని సత్యశీలత
భరతుడు శ్రీరాముని సమీపించి అంజలి ఘటించి, ఇక్ష్వాకు వంశంలో పెద్ద కుమారుడైన శ్రీరాముడు మహారాజుగా పట్టాభిషేకం జరగవలసిన సమయంలో తన తల్లి కైకేయి కారణంగా పితృవాక్య పరిపాలన కోసం పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేయాల్సి వచ్చిందని, ఇన్ని రోజులు తాను ఒక సేవకుడిగానే రాజ్యభాద్యతలు చూశానని, ఈనాటి నుంచి శ్రీరామచంద్రుడు మహారాజుగా పట్టాభిషేకం చేసుకొని రాజ్యబాధ్యతలు స్వీకరించమని కోరుతాడు. భరతుని మాటలకు సంతోషించిన శ్రీరాముడు రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరిస్తాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన కౌసల్య, కైకేయి, సుమిత్ర సీతారాములకు ఆనందబాష్పాలతో స్వాగతం పలికారు.
పట్టాభి రాముడికి మంగళ స్నానాలు
పట్టాభిషేక సుముహూర్తం రోజున శ్రీరాముడు మంగళ స్నానం ఆచరించి పట్టువస్త్రాలు, దివ్యాభరణాలు ధరించి, మంచి అంగరాగాలను పూసుకొని పట్టాభిషేకానికి సిద్ధమవుతాడు. కౌసల్యాదేవి సీతమ్మవారికి మంగళ స్నానం చేయించి పట్టుపుట్టములు కట్టి చక్కగా అలంకరిస్తుంది.
వానర కాంతల సంభ్రమం
పుష్పక విమానం నుంచి కిందకు దిగిన వానర కాంతలు అయోధ్య వాసుల ప్రేమానురాగాలు, వాళ్ళ అలంకారాలు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. అనంతరం కౌసల్య, సుమిత్ర, కైకేయి వానరకాంతలందరికి తలస్నానం చేయిస్తారు.
అయోధ్యకు పయనమైన శ్రీరామ పరివారం
సూర్యమండల సన్నిభమైన రథాన్ని శ్రీరాముడు అధిరోహించగా, భరతుడు రథం పగ్గాలు చేపట్టగా, లక్ష్మణుడు నూరు తీగలు కల గొడుగును పడుతాడు. శత్రుజ్ఞుడు, విభీషణుడు చెరో వైపు వింజామరలు వీస్తుండగా మంగళ వాయిద్యాలు ముందు నడుస్తుండగా, సుగ్రీవుడు మొదలగు వానరసేనలు వెంటరాగా రాముని రథం అయోధ్యకు బయలుదేరుతుంది. దారి పొడవునా శ్రీరాముడు కనిపించిన వారిని పలకరిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
వందిమాగధులు వెంట రాగా!
శ్రీరాముని రథం వెంట వేద పండితులు, పెద్దలు, కన్నెపిల్లలు, మంగళ ద్రవ్యాలు చేత ధరించి సువాసినులు బయలుదేరుతారు. వశిష్ఠుడు, జాబాలి, గౌతముడు వంటి మహర్షులు వెంటరాగా శ్రీరాముని రథం అయోధ్యకు చేరుకుంటుంది.
శ్రీరామ పట్టాభిషేక వైభోగం
శ్రీరాముని పట్టాభిషేకం కోసం వానరులు 4 సముద్ర జలాలు, 500 నదీజలాలను తీసుకొని వస్తారు. ఆ జలాలతో శ్రీరాముని పట్టాభిషేకం చేస్తారు. అనంతరం రామునికి వజ్ర ఖచిత కిరీటాన్ని అలంకరిస్తారు.
ఇంద్రుని కానుక
పట్టాభిషేక సుముహూర్తం సందర్భంగా ఇంద్రుడు శ్రీరామునికి నూరు బంగారు పూసలు గల హారాన్ని బహుకరిస్తాడు.
రామరాజ్యంలో ధర్మపరిపాలన
ధర్మాత్ముడైన శ్రీరాముని పాలనలో ప్రజలు సంతోషంగా జీవించేవారు. ప్రజలకు శత్రుభయం, చోరభయం ఉండేవి కావు. నెలకు మూడు వానలు కురిసేవి. భూమి సస్యశ్యామలంగా ఉండేది. పంటలు బాగా పండేవి. చెట్లన్నీ ఫల పుష్పాలతో నిండి ఉండేవి.
రామ రాజ్యమే ఆదర్శం!
అందుకే ఇన్ని ఏళ్ళు గడిచిన రాజంటే రాముడు! రాజ్యమంటే రామరాజ్యం అని పేరు నిలిచిపోయింది. ప్రజలు కూడా రామరాజ్యం కావాలనే కోరుకుంటారు. ఆ సీతారాముల దయతో రామరాజ్యం వంటి రాజ్యం ఏర్పడాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం.
ఫలశ్రుతి
శ్రీరాముల వారి పట్టాభిషేకం గురించి చదివినా, విన్నా, ఆలయాల్లో జరిగే పట్టాభిషేకం చూసినా అఖండ ఐశ్వర్యం, అత్యున్నత పదవీ యోగాలు కలుగుతాయని శాస్త్ర వచనం.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.