Rock Salt Deepam Benefits : పసి పిల్లలలకు ఉప్పుతో దిష్టి తీసే సంప్రదాయంలో ఉప్పుకు గొప్ప స్థానం ఉంది. ముఖ్యంగా దృష్టి దోషాలను పోగొట్టే శక్తి రాళ్ల ఉప్పుకు ఉందని మన పెద్దలు విశ్వసిస్తారు. అందుకే పసి పిల్లలు ఏ కారణం లేకుండా ఏడుస్తూ ఉంటే దిష్టి తగిలిందని రాళ్ల ఉప్పుతో దిష్టి తీసివేస్తారు. ఆశ్చర్యమేమిటంటే పిల్లలకు దిష్టి తీయగానే ఏడుపు మానేసి నిద్ర పోవడం మనం గమనించవచ్చు! ఉప్పుకు అంతటి గొప్ప శక్తి ఉంది.
ఒక్కోసారి మహిళలు చక్కగా అలంకరించుకుని బయటకు వెళ్లి వచ్చిన తర్వాత విపరీతమైన తలనొప్పి వచ్చిందని అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇంట్లోని బామ్మలు, అమ్మమ్మలు దిష్టి తీయించుకోమని చెప్పడం మనకు తెలిసిందే! నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని పెద్దలు అంటారు. అందుకే అనుభవం ఉన్న పెద్దలు ఎప్పుడు కూడా దిష్టి తీయించుకోడానికి ప్రాధాన్యత ఇస్తారు.
ముఖ్యంగా మహిళలు తాము స్నానం చేసే నీటిలో ఒక స్పూను రాళ్ల ఉప్పు వేసుకొని ప్రతి శుక్రవారం స్నానం చేస్తే ఎలాంటి దృష్టి దోషాలు అయినా పోతాయని పెద్దలు చెబుతారు. అలాగే మనం ఇల్లు తుడిచే నీళ్లలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని ఇల్లు తుడిస్తే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ పోతుంది.
శుక్రవారం ఉప్పు కొనాలి, ఉప్పుతో అప్పులు పరార్!
శుక్రవారం ఉప్పు కొనడం ఎంతో మంచిది. ప్రతినెలా మనం కష్టపడి పనిచేసి సంపాదించిన జీతం డబ్బులో నుంచి కొంత మొత్తాన్ని తీసి వెంటనే ఆ డబ్బును మొదటిసారిగా రాళ్ల ఉప్పును కొనడానికి ఖర్చు చేయాలి. అది శుక్రవారం అయితే మరీ మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు ప్రీతిపాత్రమైనది. జీతం డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మొదటగా ఉప్పు కోసం ఖర్చు చేస్తే అప్పులు ఉండవు. దారిద్ర్యం తొలగిపోతుంది. మంగళవారం, శనివారం ఉప్పు కొనకూడదు.
ఉప్పు దీపం ఐశ్వర్య కారకం
ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసే ప్రమిద కింద రాళ్ల ఉప్పును ఉంచి దానిపై ప్రమిద పెట్టాలి. అందులో ఆవు నేతిని పోసి దీపం వెలిగించాలి. ఆ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి అష్టోత్తర శత నామాలతో పూజిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో నివసించే వారు ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో వర్ధిల్లుతారు.
ఉప్పు చేతులు మారితే ముప్పు
పెద్దలు, పండితులు చెప్పేదాని ప్రకారం ఒకరి చేతి నుంచి మరొకరు ఉప్పును అందుకోకూడదు. ఇలా చేస్తే కలహాలు వస్తాయని అంటారు. ఉప్పు జాడీలో పెడితే వద్దన్నా డబ్బు మన ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది. ఉప్పు ఉంచుకునే జాడీలో ఒక రూపాయి వేసి ఉంచితే డబ్బు వస్తూనే ఉంటుందని వాస్తు శాస్త్ర పండితులు, పెద్దలు సూచిస్తున్నారు. ఈ సూచనలు పాటించి ప్రతి శుక్రవారం రాళ్ల ఉప్పు పరిహారాలు చేసుకొని అందరు ఆనందంగా ఐశ్వర్యంగా ఉందాం.