Rahukal Adishakti Puja Vidhanam In Telugu : దేవీభాగవతం ప్రకారం ఉన్నది ఒకటే స్వరూపమే. అదే ఆదిశక్తి. త్రిమూర్తులు, లక్ష్మీ సరస్వతి, పార్వతులు కూడా ఈ ఆదిశక్తి నుంచే ఉద్భవించారు. ఆదిపరాశక్తి స్త్రీ స్వరూపాలుగా లక్ష్మీ సరస్వతి, పార్వతులు ఉంటే పురుష స్వరూపాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. ఉన్నది ఒక్కటే శక్తి! ఆ శక్తి నుంచి ఉద్బవించిన త్రిమూర్తులు సృష్టి స్థితి లయమనే కార్యాలు నిర్వహిస్తూ ఉంటే లక్ష్మీ సరస్వతి పార్వతులు వారికి అర్ధాంగులుగా శక్తి స్వరూపాలుగా ఉంటారు.
రాహుకాల పూజలందుకునే ఆదిపరాశక్తి
అలాంటి ఆది పరాశక్తిని రాహు కాలంలో పూజిస్తే దొరకని సంపద ఉండదు. తీరని కోరిక ఉండదని శాస్త్ర వచనం. ముఖ్యంగా శుక్రవారం అమ్మవారిని రాహుకాలంలో పూజిస్తే కొన్నేళ్లుగా వేధిస్తున్న సమస్యలు దూరమవుతాయి.
రాహుకాలమంటే!
తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి రోజు ఒకటిన్నర గంటల సమయం పాటు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణాలు, శుభకార్యాలు, పెళ్లిమాటలు వంటివి చేయరు. మంచి పనులు చేయకూడని ఈ రాహుకాలం అమ్మవారి ఆరాధనకు విశిష్టమైనదని శాస్త్రం చెబుతోంది. ఈ రాహుకాల సమయం ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఒక్కోరోజు ఒక్కోలా ఉంటుంది.
శుక్రవారం రాహుకాల సమయం ఎప్పుడంటే!
ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నిముషాల నుంచి 12:00 గంటల వరకు రాహుకాలం ఉంటుంది.
శుక్రవారం రాహుకాల పూజ ఎలా చేయాలి?
ముందుగా మీ సమీపంలో రాహుకాల పూజ జరిగే దుర్గాదేవి ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. ఈ పూజ తొమ్మిది శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మానసికంగా సిద్ధంగా ఉండండి. రాహుకాల పూజ చేసే శుక్రవారం పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి.
పూజకు సిద్ధం ఇలా
శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. అనంతరం ఇంట్లో పూజాదికాలు పూర్తి చేసుకోవాలి. సమీపంలోని దుర్గాదేవి ఆలయానికి 10:30 గంటలకు చేరుకోవాలి. రాహుకాల పూజ ఖచ్చితంగా 10:30 గంటల నుంచి 12:00 గంటల లోపు మాత్రమే చేయాలి. ముందుగా అమ్మవారికి నమస్కరించుకుని మనసులో మన సమస్యను చెప్పుకొని అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తున్న రాహుకాల పూజ ఫలవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి.
పూజావిధానం
దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకుని నేలను నీటితో శుభ్రం చేసుకొని పద్మం ఆకారంలో ముగ్గు వేసుకోవాలి. పసుపు కుంకుమ పూలు ముగ్గు మధ్యలో అలంకరించాలి. ఇప్పుడు పసుపు రంగులో ఉండే నిమ్మకాయను రెండుగా కోసి వాటిలోని రసాన్ని తీసి వేసి నిమ్మకాయ చెక్కలు వెనుకవైపు నుంచి మెల్లగా ఒత్తుతూ ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. రెండు నిమ్మకాయ డొప్పల్లో ఆవునేతిని పోసి, ఒక్కో దానిలో రెండు ఒత్తులు వేసి అమ్మవారి ఎదుట దీపారాధన చేయాలి. దీపారాధనకు కుంకుమ అలంకరించాలి. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత పూజారి చేత అమ్మవారి పేరు మీద అర్చన జరిపించుకోవాలి. అమ్మవారికి మూడు ప్రదక్షిణలు చేయాలి. ఈ పూజ తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయరాదు. దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసం విరమించవచ్చు.
సకల కార్య సిద్దినిచ్చే రాహుకాల పూజ
ఈ విధంగా ఆది పరాశక్తికి రాహుకాల పూజ 9 వారాలు నియమనిష్ఠలతో చేస్తే రాహు గ్రహ దోషాలు, కుజ దోషాలు పోతాయి. దుర్గాదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు పోయి జీవితంలో స్థిరత్వం కలుగుతుంది. చేసే ప్రతి పనిలోనూ సానుకూలత ఉంటుంది. ఇంట్లో ఎన్నడూ ధనానికి లోటుండదు. ఇది సాక్షాత్తు అమ్మవారు తన భక్తులను అనుగ్రహించి ఇచ్చిన వరం. ఈ పూజ స్త్రీ పురుషులు, పెద్దలు, యుక్తవయసు వచ్చిన వారు ఎవరైనా చేయవచ్చు. స్త్రీలు ఇబ్బంది ఉన్న సమయాన్ని విడిచిపెట్టి పూజను కొనసాగించవచ్చు. ఓం శ్రీ దుర్గా దేవ్యై నమః మూలగ్రంధం: వ్యాస మహర్షి విరచిత శ్రీదేవీభాగవతం
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మ్యారేజ్ లేట్ అవుతుందా? శుక్రవారం ఈ పూజ చేస్తే చాలు అంతా చకచకా! - Puja For Marriage