Pushya Putrada Ekadashi 2024 Date and Time: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతీ మాసంలో రెండు ఏకాదశులు ఉంటాయి. అలా ఏడాది మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిల్లో ఒకటైన పుత్రదా ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. దీనిని పుష్య మాసంలో శుక్ల పక్షం ఏకాదశి రోజున జరుపుకుంటారు. మరి, ఈ ఏకాదశి విశిష్టత ఏంటి? పూజ ఎలా చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
పుత్రదా ఏకాదశి శుభముహూర్తం: పుష్య మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈసారి కొత్త సంవత్సరం 2024లో మొదటి నెల పుత్రదా ఏకాదశితో మొదలవుతోంది. ఈ ఏడాది జనవరి 21న పుత్రదా ఏకాదశి వచ్చింది. ఈ తిథి జనవరి 20 సాయంత్రం 7.42 గంటలకు ప్రారంభమై.. జనవరి 21 సాయంత్రం 7.26 గంటలకు ముగుస్తుంది. అయితే.. హిందూ పంచాగం ప్రకారం ఏకాదశి తిథిని ఉదయం లెక్కిస్తారు. కాబట్టి జనవరి 21 ఆదివారం పుత్రదా ఏకాదశి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
పుత్రదా ఏకాదశి రోజున ఏం చేయాలి: సంతాన ప్రాప్తి కోసం దంపతులు ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. ఆరోజున భక్తులు ఉపవాసం ఉండాలి. అయితే ఉపవాసం ఉండేవారు ఒకరోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం ఉన్న స్త్రీ లేదా పురుషుడు బ్రహ్మచర్యం పాటించాలి.
పుత్రదా ఏకాదశి పూజా విధానం:
- తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి.
- ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి.
- గంగా జలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి.
- శ్రీహరికి పూలు, తులసి సమర్పించాలి.
- ఈరోజు ఉపవాసం ఉండాలి.
- సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి.
- విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి కటాక్షం పొందుతారు.
సంతాన ప్రాప్తి కోసం:
- ఈ రోజున ఉదయాన్నే ఇళ్లు శుభ్రం చేసుకుని కాలకృత్యాలు తీర్చుకుని.. తలస్నానం చేసి ఉపవాస దీక్షను తీసుకోవాలి.
- అనంతరం పూజ ప్రారంభించాలి.
- పూజలో విష్ణువు విగ్రహాన్ని లేదా ఫొటోను ఉంచాలి.
- ఫొటో ముందు కలశాన్ని ఉంచి.. దానికి ఎర్రటి వస్త్రం చుట్టాలి.
- తర్వాత నెయ్యితో దీపం వెలిగించి.. శ్రీమహావిష్ణువును పూజించాలి.
- పూజలో పూలు, కొబ్బరికాయ, తమలపాకులు, లవంగం, జామకాయ మొదలైన వాటిని ఉంచాలి.
- అలాగే పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి.
- ఏకాదశి నాడు జాగరణ చేయాలి.
- చివరగా పుత్రదా ఏకాదశి కథ చదివి.. హారతి ఇవ్వాలి.
పుష్య పుత్రదా ఏకాదశి కథ: పూర్వం భద్రావతి నగరంలో సుకేతుమన్ అనే రాజు ఉండేవాడట. అతని భార్య పేరు శైవ్య. తన రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎన్నో పనులు చేసేవాడు. కానీ రాజుకి సంతానం కలగలేదు. సంతానం కోసం రాజు తిరగని పుణ్యక్షేత్రం లేదు. కానీ అతని కోరిక మాత్రం నెరవేరలేదు. ఒకరోజు రాజు తన రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక మహర్షి దగ్గరకి వెళ్లాడు. ఆయన దగ్గరకి వెళ్లి తన సమస్య చెప్పుకుని పరిహారం అడిగాడు. అప్పుడు ఆ మహర్షి పుత్రదా ఏకాదశి గురించి చెప్పి ఆరోజు ఉపవాసం ఉంటే మంచిదని సూచించారు. మహర్షి చెప్పినట్టుగానే రాజు.. తన భార్యతో కలిసి పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి రాజు భార్య గర్భం దాల్చింది. పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. అప్పటి నుంచి విష్ణు మూర్తిని పూజిస్తూ పుత్రదా ఏకాదశిని జరుపుకుంటున్నారని ప్రతీతి.