Poli Padyami Pooja Vidhanam Story In Telugu : కార్తిక మాసంలో వచ్చే చివరి రోజును పోలి స్వర్గం అంటారు. ఈ రోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. పోలి కథను చదువుకుంటారు. ఈ సందర్భంగా పోలి పాడ్యమి పూజ ఎలా చేయాలి? అసలు ఈ పోలి ఎవరు? ఆ కథ ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పోలి పాడ్యమి అంటే ఏమిటి? పోలి పాడ్యమి ఎప్పుడు?
కార్తిక మాసంలో శివకేశవుల ఆరాధన, నదీ స్నానాలు, పురాణ పఠనాలతో సందడిగా గడిచిపోయింది. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తిక మాసం చివరి రోజైన అమావాస్య మరుసటి రోజు పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. నవంబర్ 30 వ తేదీ కార్తిక అమావాస్య ఉదయం 10:30 నిమిషాల నుంచి మరుసటి రోజు అంటే డిసెంబర్ 1 వ తేదీ ఉదయం 11:51 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయంతో పాడ్యమి తిథి ఉన్న రోజునే పోలి పాడ్యమి జరుపుకోవాలి కాబట్టి డిసెంబర్ 2వ తేదీ సోమవారం రోజు పోలి పాడ్యమి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
పోలి పాడ్యమి పూజ ఇలా!
పోలి పాడ్యమినే పోలి స్వర్గం అని, పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజని కూడా అంటారు. ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీప దానం కూడా చేస్తారు. అనంతరం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. కార్తిక మాసమంతా దీపాలు వెలిగించినవారు పోలి పాడ్యమి రోజున 30 వత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి ప్రవహించే నదీ జలాలలో వదులుతారు. అలా చేసిన తర్వాత మూడు సార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించుకుని పోలి స్వర్గం కథను విని అక్షింతలు వేసుకుంటారు.
పోలి స్వర్గం కథ
అనగనగా ఒక చాకలి స్త్రీ. ఆమెకు నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకుని కార్తిక మాసమంతా ప్రతిరోజూ తన ముగ్గురు కోడళ్లతో కలిసి నదికి స్నానమునకు వెళ్లి అక్కడే దీపం పెట్టుకుని వస్తుండేది. ఇంటి చాకిరీ అంతా చిన్న కోడలు అయిన పోలి పై వేసి వెళ్ళేది. పాపం చిన్న కోడలికి కూడా కార్తిక మాసంలో నదీ స్నానం చేసి దీపారాధన చేయాలన్న కోరిక బలీయంగా ఉండేది. కానీ కార్తిక మాసం మొత్తం కూడా అత్తగారు ముగ్గురు కోడళ్లతోనే నదికి వెళ్లి స్నానం, దీపారాధన చేసింది కానీ ఒక్కనాడు కూడా చిన్న కోడలు అయిన పోలిని తీసుకు వెళ్ళలేదు.
ఆ విధంగా మాసమంతా పూర్తియైన తర్వాత కార్తిక బహుళ అమావాస్య రోజున ఆ అత్తగారు తెల్లవారుఝామునే లేచి తన ముగ్గురు కోడళ్లతో కలిసి నదికి వెళ్ళింది. చిన్నకోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈ రోజు నేను దీపం పెడతాను అని అనుకుని చల్ల చిలికిన కవ్వమునకు అంటుకుని ఉన్న వెన్నను తీసి, పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడి ఉన్న పత్తి కాడను తీసి వత్తి చేసి, పెరటిలో బావి వద్ద స్నానం చేసి, తీసి ఉంచిన వెన్న, వత్తి తో కలిపి దీపము వెలిగించి, ఆ దీపమును అత్తగారు చూడకుండా దానిమీద ఒక చాకలి బానను మూత వేసింది. అంతలో హఠాత్తుగా ఆకాశము నుండి దేవదూతలు పోలి కోసం విమానం తీసుకువచ్చారు. అప్పుడు పోలి ఆ విమానము ఎక్కి బొందితో (అనగా ప్రాణమున్న శరీరంతో) స్వర్గమునకు వెళ్లసాగెను.
ఆమె ఆవిధముగా వెళ్లడం నది ఒడ్డున దీపములు పెట్టుకుంటున్న వారు చూసి "ఓహో! చాకలి పోలి స్వర్గానికి వెళ్లుచున్నది" అని అందరు ఆశ్చర్యపడసాగిరి. అంతట పోలి అత్తగారు "మా పోలి స్వర్గానికి వెళ్లడం ఏమిటి?" అని ఆమెను, ఆమె ముగ్గురు కోడళ్ళు ఆశ్చర్యముతో చూడసాగిరి. అలా చూసి వాళ్ళు తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్లాలనుకుని పోలి కాళ్ళు పట్టుకుని గాలిలోనే ఊగసాగారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు నీ చిన్న కోడలిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడళ్లను మాత్రమే తీసుకుని వెళ్లి, శ్రద్ద లేకుండా, భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు. కానీ ఈమె ఒక్క రోజు ఇంట్లో పెట్టుకున్నా భక్తిశ్రద్ధలతో దీపం పెట్టుకుంది. కాబట్టి నేను పోలిని బొందితో స్వర్గానికి తీసుకువెళుతున్నాను. నీవు అడవులపాలై పొమ్ము" అని శపించాడు. ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే కార్తిక మాసమంతా పురాణ పఠనం, శ్రవణం చేసిన ఫలితం పరిపూర్ణం అవుతుంది. ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.