Polala Amavasya 2024 : శివ, నారద పురాణం ప్రకారం పోలాల అమావాస్య పూజని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మంచి సంతానం కలుగుతుందని శాస్త్ర వచనం. ఈ ఏడాది సెప్టెంబర్ 2న సోమవారం రోజు అమావాస్య తిథి పూర్తిగా ఉంది. అదే రోజున పోలాల అమావాస్య జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. అమావాస్య తిథి సోమవారం తెల్లవారు ఝామున 5:30 నిమిషాలకు మొదలై, ఆ తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 3న మంగళవారం ఉదయం 7:25 నిమిషాల వరకు ఉంది. కానీ ఈ పూజ చేయాలంటే రాత్రి సమయంలో అమావాస్య ఉండాలి. సోమవారం రోజు పోలాల అమావాస్య పూజను చేసుకోవాలి.
పూజకు శుభ ముహూర్తం
పోలాల అమావాస్య పూజను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఈ పూజను సాయంత్రం చేస్తారు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు చేసుకోవచ్చు.
పూజా విధానం
పోలాల అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, శుచియై ఈ రోజు పోలాల అమావాస్య పూజను చేస్తానని మనసులో సంకల్పించుకోవాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. పూజామందిరాన్ని శుభ్రం చేసి నిత్య పూజను యధావిధిగా పూర్తి చేసుకోవాలి. అనంతరం పూజ గదిలో కంద మొక్కను ఉంచాలి. ఆ మొక్కకు 9 పసుపు కొమ్మలు కట్టాలి. ముందుగా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళ గౌరీ దేవి లేదా సంతాన లక్ష్మీదేవిని ఆవాహనం షోడశోపచారాలతో పూజలు చేయాలి. 5 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి.
ఉపవాస విరమణ
దేవునికి నివేదించిన ప్రసాదాలను భక్తిగా అందరితో కలిసి స్వీకరించి ఉపవాస విరమణ చేయాలి.
పూజించిన కంద మొక్కను ఇలా చేయాలి
పోలాల అమావాస్య మరుసటి రోజు పూజించిన కంద మొక్కను ఇంటి ఆవరణలో, పూల కుండీల్లో నాటాలి. ప్రతిరోజూ నీళ్లు పోస్తూ మొక్కను సంరక్షించాలి. కొద్ది రోజులకు ఈ మొక్క పక్కనే మరికొన్ని పిలకలు వస్తాయి. అలా రావడం శుభసూచకం. కంద మొక్కకు పిలకలు వస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. మన భారతీయ సంప్రదాయంలో పూజలు, వ్రతాల పేరుతో మొక్కలను పూజించడం వాటిని సంరక్షించడం ఆనవాయితీ. ఈ వంకతో ప్రకృతిని కూడా సంరక్షించిన ప్రయోజనం కలుగుతుంది. అందుకే కేవలం సంతానం కోరుకునే వారు మాత్రమే కాదు ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు అని శాస్త్రం చెబుతోంది. రానున్న పోలాల అమావాస్య పూజను మనం కూడా భక్తిశ్రద్ధలతో చేసుకుందాం. ఆ గౌరీ దేవి అనుగ్రహానికి పాత్రులవుదాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.