Remedies to Do on Polala Amavasya 2024: హిందూ సంప్రదాయాల ప్రకారం పోలాల అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ, వివాహిత మహిళలు తమ సంతానం కోసం, పిల్లల యోగ క్షేమాలను కాంక్షిస్తూ వ్రతాలను ఆచరిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన అంటే శ్రావణ మాసంలో చివరి రోజున సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది. అయితే ఈ అమావాస్య రోజున ఈ విధివిధానాలు పాటించడం వల్ల జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయని, అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని, అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజప కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఇంతకీ ఆ విధివిధానాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారని మాచిరాజు కిరణ్కుమార్ అంటున్నారు. సోమవారం నాడు వచ్చిన అమావాస్య కాబట్టి దీనిని సోమవతి అమావాస్య అంటారని.. అలాగే దీన్నే శ్రావణ అమావాస్య, కుషోత్పతి అమావాస్య అని కూడా అంటారని అంటున్నారు.
పాటించాల్సిన విధివిధానాలు ఇవే:
- పోలాల అమావాస్య ఎంతో శక్తిమంతమైనదని మాచిరాజు కిరణ్కుమార్ అంటున్నారు. ఈ రోజున గ్రామంలోని గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి పెరుగన్నం నైవేద్యంగా పెడితే కష్టాలన్నీ తీరిపోతాయని అంటున్నారు. అలాగే గ్రామదేవతలకు నిమ్మకాయ దండలు వేసినా, నిమ్మకాయ దీపాలు వెలిగించినా, కుంకుమ సమర్పించినా ఇంట్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.
- శ్రావణ అమావాస్య రోజున ఎద్దుకు ఆహారం తినిపిస్తే మనసులో కోరుకున్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయని అంటున్నారు. అలాగే జాతకంలో కుజ దోషాల వల్ల వివాహ, దాంపత్య సమస్యలు ఉన్నవారు పోలాల అమావాస్య రోజు ఎద్దుకు బెల్లం ముక్క లేదా బెల్లంతో తయారైన పదార్థాలు తినిపిస్తే దోషాలు తొలగిపోతాయని అంటున్నారు.
- సోమవతి అమావాస్య రోజున శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మంచిదని అంటున్నారు. ప్రదోష కాలంలో అంటే సాయంత్రం పూట శివాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అలాగే చండీ ప్రదక్షిణ చేసినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మాచిరాజు కిరణ్కుమార్ చెబుతున్నారు. శివాలయంలో సోమ సూత్రం దాటకుండా ధ్వజస్తంభం నుంచి మొదలు సోమసూత్రం వరకు సవ్య, అపసవ్య దిశలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. ఇక సోమసూత్రం అంటే శివలింగానికి అభిషేకం చేసిన జలాలు అన్నీ ఓ మార్గం ద్వారా బయటకు వస్తుంటాయి. ఆ మార్గాన్ని సోమసూత్రం అంటారని అంటున్నారు.
- దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు, ఒంటి మీద దెబ్బలు.. ఇవన్నీ నయం కావాలంటే సోమవతి అమావాస్య రోజు శివలింగానికి ఆవు పెరుగు లేదా ఆవు పాలతో అభిషేకం చేయాలని అంటున్నారు. అభిషేకం చేసే సమయంలో బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ అంటూ మూడు నామాలు చదువుకోవాలని చెబుతున్నారు.
- కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలంటే సోమవతి అమావాస్య రోజున మహిళలందరూ రావిచెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలని అంటున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కో ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం ఉంచి ప్రదక్షిణ చేయాలని సూచిస్తున్నారు. 108 పూర్తయిన తర్వాత రావి చెట్టు వద్ద ఉంచిన ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరాన్ని ఎవరికైనా పంచిపెట్టాలని సలహా ఇస్తున్నారు. దీనినే అమాసోమవార వ్రతం అంటారని అంటున్నారు.
Note: పైన తెలిపిన వివరాలు కొందరు జోతిష్య నిపుణులు, జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి:
తులసి కోట దగ్గర ఈ తప్పులు చేస్తున్నారా? - ఐశ్వర్యం నశించి ఆర్థిక ఇబ్బందులు తప్పవు!
ఆ గుడిలో అంజన్నకు చిటికెన వేలు ఉండదు- అలా అని చెక్కితే రక్తమే రక్తం!
కృష్ణుడి జన్మ రహస్యం ఇదే- చదివిన వారికే పుణ్యమంతా! - Sri Krishna Ashtami 2024