Panchmukhi Hanuman Puja Benefits : రామాలయం లేని ఊరు ఉండదు. ఆంజనేయస్వామి విగ్రహం లేని వీధి ఉండదు అని అంటారు. అలా మన ఊరిలో మన వీధిలో మనలో ఒకరుగా మెలిగే దైవం ఆంజనేయ స్వామి. ఎక్కడెక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడక్కడ హనుమ కొలువై ఉంటాడు. హనుమను ఎన్నో రూపాలు, మరెన్నో పేర్లతో భక్తులు పూజిస్తూ ఉంటారు. వీరాంజనేయుడిగా, ప్రసన్నాంజనేయుడిగా, దాసాంజనేయుడిగా, అభయాంజనేయుడిగా కార్యసిద్ధి హనుమగా ఇలా ఎన్నో పేర్లతో ఎన్నో ముద్రలతో హనుమ భక్తులు అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే కొన్ని ప్రదేశాల్లో హనుమ పంచముఖ హనుమంతుడు కొలువై ఉంటాడు. అలాంటి పంచముఖ హనుమను దర్శిస్తే అయిదుగురు దైవాల అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
పంచముఖ హనుమ విశిష్టత
అసలు పంచముఖ హనుమ స్వరూపమే అద్వితీయం అసామాన్యం. పంచముఖ స్వరూపంలో హనుమ మధ్యలో హనుమ ముఖంతో ఉండగా, మిగతా నాలుగు ముఖాలుగా మొదటిది నారసింహ ముఖం, రెండోది గరుత్మంత ముఖం, మూడోది వరాహ ముఖం, నాలుగోది హయగ్రీవ ముఖంతో హనుమ దర్శనమిస్తాడు.
పంచముఖ హనుమను పూజించే విధానం
మామూలుగా హనుమను ఎలా పూజిస్తామో పంచముఖ హనుమను కూడా అలాగే పూజించవచ్చు. అయితే ఇక్కడ హనుమ స్వరూపంలో రెండు రూపాల్లో విష్ణుమూర్తి అవతారలైన వరాహ అవతారం, నరసింహ అవతారం ఉన్నందున విష్ణువుకు ప్రీతికరమైన చందనం, తులసి వంటి ద్రవ్యాలతో పంచముఖ హనుమను పూజించవచ్చు.
పంచముఖ హనుమకు ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి
పంచముఖ హనుమ స్వరూపంలో భాగమైన నరసింహ స్వామికి ఇష్టమైన వడపప్పు, పానకం వంటివి పంచముఖ హనుమకు నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే వెన్న కూడా హనుమకు విశేషంగా సమర్పిస్తారు. బెల్లంతో చేసిన అప్పాలు, మినప గారెలు, అరటి పండ్లు కూడా ఈ స్వామికి విశేషంగా నివేదిస్తారు.
పంచముఖ హనుమను పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి
*పంచముఖ హనుమ స్వరూపంలో ప్రధాన దైవమైన హనుమ అనుగ్రహంతో ఎంతటి క్లిష్టమైన కార్యమైనా సాధించగల శరీర బలం, మనోబలం చేకూరుతాయి.
*పంచముఖ హనుమ స్వరూపంలో మొదటి దైవమైన నరసింహస్వామి వలన సిరి సంపదలు చేకూరుతాయి.
*పంచముఖ హనుమ స్వరూపంలో రెండో దైవమైన గరుత్మంతుడి వలన కార్యసాధన జరుగుతుంది.
*పంచముఖ హనుమ స్వరూపంలో మూడో దైవమైన వరాహస్వామి వలన మంచి ఆరోగ్యం సొంతమవుతుంది.
*పంచముఖ హనుమ స్వరూపంలో నాలుగో దైవమైన హయగ్రీవస్వామి వలన జ్ఞానం, విద్య, విజయం లభిస్తాయి.
పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఈ ఫలితాలు
*ఐదు ముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
*పంచముఖ హనుమ ఫోటో ఇంట్లో ఉంటే గ్రహదోషాల నుంచి బయటపడతారు. దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు.
పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపం ఎంతో శక్తివంతం. ముఖ్యంగా మంగళవారం, శనివారాల్లో ఈ స్వామిని కొలిస్తే శని బాధలు, గ్రహపీడలు తొలగిపోతాయని విశ్వాసం.
జై శ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.