Narasimha Jayanti 2024 : శ్రీమన్నారాయణుడు లోకకల్యాణం కోసం స్వీకరించిన దశావతారాల్లో నాలుగోది శ్రీ నరసింహావతారం. అసలు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎందుకు స్వీకరించాడు. ఆ అవతారం పరమార్థం ఏమిటో నరసింహ స్వామి జయంతి సందర్భంగా ఇప్పుడు తెలుసుకుందాం.
హిరణ్యాక్షుని సంహారం
కశ్యప ప్రజాపతి భార్య దితికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే ఇద్దరు కుమారులు జన్మిస్తారు. హిరణ్యాక్షుడు అమితమైన బలంతో, గర్వంతో విర్రవీగి దేవతలను యుద్ధంలో ఓడించి భయభ్రాంతులను చేయసాగాడు. చివరకు పాతాళంలో భూదేవిని రక్షిస్తున్న వరాహమూర్తి అవతారంలో ఉన్న శ్రీ మహా విష్ణువును కూడా కవ్వించి యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు.
హిరణ్యకశ్యపుని ఘోర తపస్సు
తన సోదరుడి మరణంతో తీవ్ర దుఃఖముతో హిరణ్యకశ్యపుడు బ్రహ్మ గురించి భీకరమైన తపస్సు మొదలు పెట్టాడు. అతని తపస్సు ధాటికి ముల్లోకాలు కంపించిపోయాయి. ఈ తపస్సుకు హిరణ్యకశ్యపుని శరీరం ఎముకల గూడులా మారింది. చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కమండలంలోని జలాన్ని హిరణ్యకశ్యపుని శరీరంపై చల్లగానే అతని శరీరం నవయౌవనంగా, వజ్ర సదృశంగా మారింది.
కనివిని ఎరుగని కోరిక
హిరణ్యకశ్యపుని తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు విధాతకు మొక్కి, తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపై గాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి, పగలు గాని, దేవ దానవ మనుష్యులు, జంతువులుగాని, ఆయుధములతోగాని, ఇంటాబయటగాని మరణము కలగకూడదని కోరాడు. దానికి తధాస్తు అని బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు.
వరగర్వంతో రెచ్చిపోయిన హిరణ్యకశ్యపుడు
బ్రహ్మ నుంచి పొందిన వరగర్వంతో హిరణ్యకశ్యపుడు ముల్లోకాలను జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. పంచభూతాలను నిర్బంధించాడు. మహర్షుల తపస్సును భగ్నం చేస్తూ, సాధువులను హింసించసాగాడు. అతని ఆగడాలను భరించలేక దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. విష్ణమూర్తి దేవతలకు అభయమిచ్చాడు.
ప్రహ్లాద జననం
హిరణ్యకశ్యపుడు యుద్ధ కాంక్షతో రగిలిపోతూ విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో అదును చూసుకొని దేవతలు అతని రాజ్యంపై దండెత్తి గర్భవతియైన హిరణ్యకశ్యపుని భార్య లీలావతిని ఇంద్రుడు చెరపట్టబోగా నారదుడు, ఇంద్రుని మందలించి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకుపోతాడు. అక్కడ నారదుని నారాయణ భక్తి కీర్తనలు విన్న లీలావతి కడుపులో ఉన్న శిశువు నారాయణ భక్తుడవుతాడు.
రాక్షసుని ఇంట మహాభక్తుడు
హిరణ్యకశ్యపుడు రాజ్యానికి తిరిగి రాగానే నారదుడు లీలావతిని అప్పగిస్తాడు. కొన్ని రోజులకు విష్ణు ద్వేషి హిరణ్యకశ్యపుని ఇంట మహా భక్తుడు ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు విన్న నారాయణ భాగవత కధల వాసన వలన పుట్టుకతోనే నారాయణ భక్తుడవుతాడు. నోరు తెరిస్తే శ్రీహరి నామం తప్ప మరొకటి ఉండేది కాదు.
హిరణ్యకశ్యపునికి కంటకంగా మారిన ప్రహ్లాదుడు
హిరణ్యకశ్యపుడు ప్రహ్లదునిచే విష్ణుభక్తి మాన్పించాలని, శ్రీహరి నామం ఉచ్చరించకుండా చేయాలనీ అతనిని ఎన్నో హింసలకు గురిచేస్తాడు. చివరకు 'ఎక్కడ ఉన్నాడురా నీ శ్రీహరి ఈ స్తంభంలో ఉంటాడా చూపించు' అని ఆగ్రహంతో తన చేతిలోని గదతో స్తంభాన్ని విరగగొట్టుడతాడు.
నమో నారసింహాయ
వైశాఖ శుద్ధ చతుర్దశి సాయం సంధ్యా సమయంలో దిక్కులు పిక్కటిల్లేలా పెద్ద శబ్దంతో స్తంభం నుంచి నరసింహుడు ఉద్భవించి హిరణ్యకశ్యపుని సంహరిస్తాడు. బ్రహ్మ హిరణ్యకశ్యపుని ఇచ్చిన వరం ప్రకారం పగలు రాత్రి కానీ సంధ్య సమయంలో, ఇంటా బయటా కానీ గడప మీద ఆయుధం లేకుండా, నరుడు కానీ జంతువు కానీ నరసింహావతారంలో, ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అయిన చేతి గోళ్లతో హిరణ్యకశ్యపుని కడుపు చీల్చి అతనిని సంహరిస్తాడు.
నరసింహ జయంతి రోజు ఇలా చేయాలి
నరసింహ జయంతి రోజున నరసింహ స్వామి ఉగ్ర స్వరూపం శాంతింప చేయడానికి స్వామికి వడపప్పు, పానకం నివేదించాలి. శ్రీలక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం పఠించాలి. ముఖ్యంగా ఎవరికైనా కోర్టు సమస్యలు, తీరని కష్టాలు ఉంటే నృసింహ జయంతి రోజు ఆలయంలో స్వామిని దర్శిస్తే సమస్యలు తీరుతాయి. ఎప్పుడూ కోపం, ఆవేశంతో ఉండే వారు ప్రతిరోజూ సాయం సంధ్యా వేళ శ్రీలక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే ప్రశాంతంగా ఉంటారు.
నృసింహ జయంతి రోజు నరసింహుని అవతార కథ విన్నా చదివినా సమస్త ఈతి బాధలు తీరిపోతాయి.
శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమ్!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఏ నక్షత్రం వారు ఎలాంటి రుద్రాక్ష ధరించాలి? నియమాలు కంపల్సరీనా? - Rudraksha According To Nakshatra