Mud Ganesha Idol Puja Benefits In Telugu : ప్రకృతి ప్రేమికులు ప్రతి ఏటా చేసే నినాదం 'మట్టి గణపతిని పూజిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం' నిజానికి ప్రతి ఒక్కరూ ఇలా మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లే! ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులు వాడిన వినాయకులను పూజించి అటు తర్వాత వాటిని నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది.
అందుకే మార్కెట్లో ఇప్పుడు వినాయకుని ప్రతిమలు తయారు చేసుకోవడానికి అవసరమైన మౌల్డ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి సహాయంతో మనం ఇంట్లోనే బంకమట్టి తెచ్చుకుని వినాయకుని తయారు చేసుకొని, కృత్రిమ రంగులు కాకుండా సహజ రంగులు వాడి వినాయకుని తయారు చేసుకోవచ్చు. సహజమైన రంగులు మనకు కూరగాయల నుంచి, పువ్వుల నుంచి వస్తాయి.
సింపుల్గా ఇలా!
గణపతిని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఇంకో సులభమైన ఉపాయముంది. అది ఏమిటంటే పసుపుతో చక్కగా చిన్న గణపతిని తయారు చేసుకోవచ్చు. గణపతి ఆకారం తయారు చేసుకున్న తర్వాత చిన్న మిరియాలు గాని, ఆవాలు గాని వాడి కళ్లను తయారు చేసుకోవచ్చు. ఇలా సృజనాత్మకతతో ఆలోచిస్తే ఎన్నో ఉపాయాలున్నాయి. ఇలా తయారు చేసుకున్న వినాయకుని నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, నదులు కలుషితం కావు. పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్టవుతుంది.
భగవంతుని పూజలో భక్తి ప్రధానం
భగవంతుని పూజకు భక్తి ప్రధానం. భక్తి లేకుండా బంగారు విగ్రహాన్ని పూజించినా ఫలితం ఉండదు. త్రికరణ శుద్ధితో, భక్తి శ్రద్ధలతో చిన్న వినాయకుని పూజించినా ఫలితం ఉంటుంది. అంతేకాని ఆర్భాటాలకు, గొప్పలకు పోయి పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి తరువాత వాటిని నిమజ్జనం చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెద్ద విగ్రహాల తయారీలో వాడే వస్తువులు నీటిలో కరిగిపోవు. నీటి కాలుష్యానికి కారణమయ్యే అనేక రకాల కృతిమ రంగులు, కెమికల్స్ వీటిలో ఉంటాయి. వినాయక చవితిని సింపుల్ గా చేసుకోవడం వల్ల నష్టమేమీ లేదు. ఎంత భక్తిగా దేవుని పూజిస్తున్నామో ముఖ్యం గానీ, ఎంత ఆడంబరంగా చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. మన చుట్టూ ఉండే ప్రకృతే దైవ స్వరూపం. కనిపించే ప్రకృతిని నాశనం చేస్తూ కనబడని దేవుని పూజిస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రకృతిని దైవంగా భావిస్తూ మట్టి గణపతి పూజిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.
- జై బోలో గణేష్ మహారాజ్ కీ జై!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.