Mrigasira Karthi 2024 In Telugu : భారతీయ జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు ఒక్కో నక్షత్రంలోకి ప్రవేశించే దానిని బట్టి ఆ నక్షత్రం పేరుతో కార్తెలు ఏర్పడతాయి.
మృగశిర కార్తె ప్రత్యేకత
మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం అనే పేర్లతో పిలుస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో వేసవి తీవ్రత తగ్గుముఖం పట్టి తొలకరి జల్లులు ప్రారంభం అవుతాయి. నైరుతి రుతుపవనాల ఆగమనం కూడా మొదలవుతుంది.
ఏరువాక ప్రారంభం
మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలో పలు ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల ద్వారానే ఏడాది మొత్తం వచ్చే వర్షంలో 70 శాతం వర్షపాతం కురుస్తుంది. రైతన్నలు మృగశిర కార్తె రాగానే వ్యవసాయ పనులు మొదలు పెట్టి ఏరువాక పున్నమి రాగానే దుక్కి దున్ని నాట్లు వేయడం ప్రారంభిస్తారు. ఇలా దేశవ్యాప్తంగా పంటలు పండటానికి అవసరమైన వర్షాలు కురవడం మొదలయ్యేది మృగశిర కార్తెలోనే కాబట్టి ఈ కార్తెకు అంతటి ప్రాధాన్యం.
వాతావరణంలో మార్పులు- ఆరోగ్య సమస్యలు
మృగశిర కార్తె రాగానే ఎండలు మండించే ఎండాకాలం నుంచి ఉపశమనం దొరుకుతుంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. దీనితో శరీర ఉష్ణోగ్రతలో కూడా మార్పులు వస్తాయి. వర్షాకాలంలో సాధారణంగా వ్యాపించే జలుబు, జ్వరం, అస్తమా వంటి రోగాలు వ్యాపిస్తాయి.
మృగశిర కార్తె రోజు ఇది తప్పకుండా తినాలి
మృగశిర కార్తె రోజు కొన్ని ప్రాంతాల ప్రజలు బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం.
మృగశిర కార్తెకు చేపలకు సంబంధం ఏమిటి?
మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినే ఆచారం మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తోంది. మృగశిర కార్తె ఆరంభంలో వచ్చే వాతావరణ మార్పుల కారణంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి వ్యాధులు సంక్రమించవచ్చు. ఇలాంటి వ్యాధుల నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే! దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తింటారు. మృగశిరకార్తె రోజున ఏ ఇంట చూసినా చేపల పులుసే. చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి.
చేపలతో లాభాలు
చేపల్లోని పోషకాలు గుండె జబ్బులని దూరం చేస్తాయి. వీటల్లో మనకు అవసరమయ్యే ఎన్నో మాంసకృత్తులు, అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి మేలు చేస్తాయి. చేపల్లోని ఐరన్ కంటెంట్, కాల్షియం, విటమిన్ డి, హిమోగ్లోబిన్ అనేక వ్యాధులను పారదోలుతాయి.
హైదరాబాద్లో చేప ప్రసాదం
ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా బత్తిని బ్రదర్స్ చేపమందు పంపిణీ చేస్తారు. ఉబ్బసం, అస్తమా వంటి వ్యాధులకు ఈ చేప మందు అద్భుతంగా పని చేస్తుందని విశ్వాసం. ఈ మందు కోసం దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది వస్తారు.
ఏది ఏమైనా ఎండాకాలం పోయి తొలకరి జల్లుల మృగశిర కార్తె ప్రవేశించనున్న ఈ శుభ సమయంలో వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని. అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుందాం. లోకా సమస్తా సుఖినోభవంతు! సర్వే జనా సుఖినోభవంతు
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.