Maha Shivratri 2024 Fasting Rules : శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహా శివరాత్రి. ఈ పర్వదినాన భక్తులు శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఉపవాసం, జాగరణ, శివనామ స్మరణలతో రోజంతా గడుపుతారు. ఆ రోజున శివక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. అయితే, చాలా మందికి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేస్తారో తెలియదు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ. అసలు మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి..? ఉపవాసం ఎన్ని విధాలుగా ఉంటుంది ? ఉపవాసం చేసే వారు ఎలాంటి నియమాలను పాటించాలి ? వంటి విషయాలను తెలుసుకుందాం.
మహాశివరాత్రి ఎప్పుడు: తెలుగు సంవత్సరాది ప్రకారం మహాశివరాత్రిని మాఘ మాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8వ తేదీ శుక్రవారం వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమవుతుంది. చతుర్థశి తిథి మార్చి 9, 2024 సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది. అయితే.. శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి తిథి ఉండడం ప్రధానం.. అందుకే మహాశివరాత్రిని మార్చి 8న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
ఉపవాసం ప్రాముఖ్యత: ఎంతో ప్రాముఖ్యత కలిగిన మహాశివరాత్రి రోజునా చాలా మంది రోజంతా ఉపవాసం ఉంటారు. ఉపవాస నియమాలను భక్తిశ్రద్ధలతో పాటిస్తే.. పుణ్యఫలం దక్కుతుందని పండితులు అంటున్నారు. అలానే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, కష్టాలు తొలిగిపోతాయని అంటున్నారు. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. అలాగే శివరాత్రి రోజున జాగరణ ఉండి రాత్రి పూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరానికి తేజస్సు వస్తుందని అంటున్నారు. అయితే మహా శివరాత్రి రోజున ఉండే ఉపవాసంలో మూడు రకాలున్నాయని పండితులు అంటున్నారు. అవి ఏంటంటే-
నిర్జల ఉపవాసం : మహా శివరాత్రి రోజు అత్యంత కఠినంగా ఉండే ఉపవాసాన్ని 'నిర్జల ఉపవాసం' అని అంటారు. ఈ ఉపవాసం చేసే వారు శివరాత్రి రోజున అంటే మార్చి 8వ తేదీన ఉదయం 12 గంటల నుంచి మార్చి 9వ తేదీన సూర్యోదయ సమయం వరకూ కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉండాలని పండితులు చెబుతున్నారు.
ఫలహార ఉపవాసం : మహా శివరాత్రి రోజున ఎక్కువ మంది ఫలహార ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం ఉండే వారు కేవలం పండ్లు, పండ్ల రసాలు, డ్రైఫ్రూట్స్ వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలని అంటున్నారు.
సమాప్త ఉపవాసం : సమాప్త ఉపవాసం ఉండేవారు పండ్లు, పండ్ల రసాలు అన్నింటినీ ఒక్కసారే భోజనంతో పాటు తీసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇక ఒక్కసారి ఆహారం తీసుకున్న తర్వాత మిగతా మొత్తం సమయాన్ని శివుడిని స్మరించుకుంటూ ఉండాలని తెలియజేస్తున్నారు.
ఉపవాస నియమాలు:
- శివరాత్రి రోజున ఉపవాసం ఉండే వారు బ్రహ్మ ముహుర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే నిద్రలేవాలి.
- తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. వీలైతే ఉదయాన్నే దగ్గర్లోని శివాలయానికి వెళ్లడం మంచిది.
- ఇక రోజంతా ఆ పరమశివుడిని స్మరించుకుంటూ ఉపవాసం ఉండాలని పండితులు చెబుతున్నారు.
ఉపవాసం ఉండే వారు ఇవి చేయకూడదు :
- శివరాత్రి రోజు ఉపవాసం ఉండే వారు నల్లని దుస్తులు ధరించకండి.
- అలాగే మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకూడదు. పొగ, మద్యం తాగడం వంటివి చేయకూడదు.
- ఉప్పు ఉండే ఆహారం తినకూడదు.
మహాశివరాత్రి రోజు ఈ పనులు చేయకూడదు - శివుడు ఆగ్రహిస్తాడట!
మహా శివరాత్రి రోజున జ్యోతిర్లింగాల దర్శనం ఎంతో పుణ్యం - ఎక్కడున్నాయి? - ఎలా వెళ్లాలి?
పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైనే!