Loan Repayment Vastu Tips In Telugu : అప్పులేనివాడు గొప్ప శ్రీమంతుడు! అనే నానుడి మనం వింటుంటాం. ఎవరికైతే అప్పులు ఉండవో వాడే గొప్ప శ్రీమంతుడు అని పెద్దలు అంటుంటారు. రుణ బాధలు ఉంటే ఇంటి యజమాని అనారోగ్యంతో నీరసించి పోతుంటాడు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకునే వారిని కూడా మనం చూస్తుంటాం. అయితే, ఈ పరిస్థితికి కారణమేమిటి? ఇందుకు ఒక కారణం మితిమీరిన ఖర్చులు అయితే నివసించే ఇంట్లో వాస్తు లోపాలు కూడా అప్పుల బాధకు మరొక కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
కుబేర స్థానమే కీలకం
ఇంటికి కుబేర స్థానంగా భావించే ఉత్తరం, ఈశాన్యం, వాయవ్య దిశల్లో వాస్తురీత్యా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఇంటి యజమాని అప్పులు పాలవుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది. సంతానం కూడా వృద్ధిలోకి రాదని నిపుణులు అంటున్నారు.
ఉత్తర వాయవ్యంలో గేటు పుత్ర సంతానానికి చేటు
ఉత్తర దిక్కు ఉన్న ఇంట్లో నివసించే వారు ఉత్తర వాయవ్యం వైపు గేటు ఏర్పాటు చేసుకొని రాకపోకలు సాగిస్తుంటే ఆ ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల పుత్ర సంతానం ఎన్ని ఉన్నత చదువులు చదివినా జీవితంలో స్థిరత్వం లేక ఇబ్బందులు పడుతుంటారని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే ఉత్తర వాయవ్యం ఖాళీగా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. ఉత్తర వాయవ్యానికి ఆనుకొని ఎలాంటి గోడలు కట్టరాదు. ఖాళీగా ఉంది కదా అని ఉత్తర వాయవ్యంలో కానీ, ప్రహరీ గోడకు ఆనుకొని టాయిలెట్లు నిర్మిస్తే ఇంటి యజమాని అప్పుల బాధతో తిప్పలు పడతాడని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వాయవ్య దోషంతో తీరని అప్పులు
ఇంటికి వాయవ్యంలో దోషం ఉంటే యజమాని విపరీతంగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ దోషాన్ని సవరించుకోడానికి ఇంటి ప్రహరీ గోడ కట్టేటప్పుడు పశ్చిమ వాయవ్యం నుంచి ఈశాన్యం వరకు ఖాళీ ఉంచుకోవాలి. ప్రహరీ ఈశాన్యం వైపు చూస్తున్నట్లుగా కట్టుకుంటే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఈశాన్యం శుభ్రముతో రుణ విమోచనం
ఇంటికి ఈశాన్యం ఎప్పడు శుభ్రంగా ఉండాలి. ఈశాన్యంలో కొంచెం నీళ్లు తప్ప ఎలాంటి బరువులు ఉండరాదు. అప్పులు లేకుండా ఉండాలంటే ఈశాన్యంలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండాలి. దీంతో పాట ఇంటికి ఊపిరి వంటి వాయవ్యాన్ని మూసివేస్తే ఆ ఇంట్లోని వారు అనారోగ్య సమస్యల కారణంగా విపరీతంగా అప్పులు చేయాల్సి వస్తుంది.
దైవబలంతో మాత్రమే పోయే రుణబాధలు
రుణ విమోచనం కోసం పైన చెప్పిన వాస్తు నియమాలను పాటిస్తూ దైవ బలం మీద నమ్మకం ఉంచి ఈ పరిహారం చేసుకోవాలి. మంగళవారం రోజు శ్రీ సుబ్రమణ్య స్వామి సమక్షంలో ఆరు వత్తులతో ఆవు నేతితో దీపారాధన చేసి, ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజించాలి. అనంతరం ఆవు పాలతో తయారు చేసిన తీపి పదార్థాన్ని స్వామికి నివేదించాలి. ఆ ప్రసాదాన్ని ఇంట్లోని వారంతా తప్పకుండా సేవించాలి. ఇలా కనుక చేసినట్లయితే ఆ సుబ్రమణ్య స్వామి పరిపూర్ణ అనుగ్రహంతో రుణ విమోచనం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి వాస్తు పరిహారాలతో పాటు సుబ్రమణ్య స్వామి పూజ కూడా చేసి రుణ విమోచనం పొందవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు.
శుభం భూయాత్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇంటికి ఆ రంగులు వేస్తేనే మంచిది- కాళ్లు అక్కడ కడుక్కుంటేనే ఆరోగ్యం! - Vastu Tips For Painting House