Life Lessons to Learn From Lord Krishna: మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మవైపు నిల్చున్నాడు. కురుక్షేత్రంలో అస్త్ర సన్యాసానికి సిద్ధమైన అర్జునుడికి గీతోపదేశం చేసి, కార్యోన్ముకుడిని చేశాడు. ఇప్పటికీ ఆ గీతాసారాన్ని ఎంతోమంది అనుసరిస్తారు. అయితే.. తన జీవితం ద్వారా కూడా ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చని చాటిచెప్పాడు ఆ పరమాత్ముడు. మరి.. ఆ సూత్రధారి నుంచి ఎలాంటి జీవిత పాఠాలను నేర్చుకోవచ్చో మీకు తెలుసా?
నిజమైన స్నేహితుడిగా: స్నేహితులంటే కృష్ణుడికి ఎంతో ప్రేమ. కృష్ణుడి జీవితాన్ని గమనిస్తే.. స్నేహితులను కుటుంబ సభ్యులుగానే ప్రేమించాడు. చెప్పకుండానే స్నేహితుల కష్టాలన్నీ తెలుసుకుని వాటిని తీర్చేశాడు. మనం ఆయనలా చేయలేకపోయినా.. కనీసం స్నేహితులతో మంచిచెడ్డలు పంచుకుంటూ వారికి అవసరాల్లో చేతనైనంత సహాయం చేసినా చాలు.
ఒదిగిపోయే లక్షణం : గోపబాలురతో ఆడుకుంటూ, గోపికల కుండలు పగులగొడుతూ అల్లరి చేష్టలు చేసినా అందరూ సమానమేనన్న నిజాన్ని చెప్పకనే చెప్పాడు ఆ కన్నయ్య. కేవలం మనుషులనే కాదు.. పశువులను కూడా ప్రజలతో సమానంగా ప్రేమించడం ఆ చిన్నికృష్ణుడికే చెల్లింది. ఇలా తన జీవితం ద్వారా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సత్యాన్ని నేర్పాడు.
తల్లిదండ్రులపై ప్రేమ : తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపించాల్సిన అవసరం ఎంత ఉందో తన జీవితం ద్వారా చెప్పాడు ఆ యశోద తనయుడు. తన జన్మరహస్యం తెలుసుకోగానే చెరలో ఉన్న తల్లిదండ్రులను బయటకు తీసుకురావాలన్న కాంక్షతో అందరినీ వదిలి మధురకు పయనమయ్యాడు. మేనమామ కంసుడిని చంపి తల్లిదండ్రులను చెర నుంచి విడిపించాడు. తల్లిదండ్రుల కోసం దేన్నైనా వదులుకోవడానికి, ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనుకాడ కూడదని ఆ దేవకీ నందనుడు మనకు చెప్పకనే చెప్పాడు.
శివుడు నేర్పుతున్న జీవిత పాఠాలివే! - మీకు తెలుసా?
చెరగని చిరునవ్వు: కష్టాలనేవి భూమిపై జన్మించిన ప్రతిఒక్కరికీ సహజం. శ్రీకృష్ణుడికి కూడా కష్టాలు ఎదురయ్యాయి. అయితే వాటన్నింటినీ చిరునవ్వుతో ఎదుర్కోవడం ఆయన ప్రత్యేకత. జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా చిరునవ్వే ఆయుధంగా వాటన్నింటినీ ఇట్టే దాటేయొచ్చని తన జీవితం ద్వారా తెలియజేశాడా జనార్ధనుడు.
నిస్వార్థమైన ప్రేమ : రాధాకృష్ణుల ప్రేమ అనిర్వచనీయమైనది. వారిద్దరి ప్రేమలో ఎటువంటి స్వార్థం కనిపించదు. మనం కూడా అలానే ఉండాలని ఆ రాధావల్లబుడి ప్రేమ చాటిచెప్తుంది. ఏమీ ఆశించకుండా ఇతరుల పట్ల నిస్వార్థమైన ప్రేమ చూపించాలని, ఎవరి నుంచైనా తీసుకోవడం కంటే.. ఇవ్వడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన ప్రేమ తత్వం బోధిస్తుంది.
ధర్మం: అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో తన సొంత కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి ఆలోచించే సమయంలో.. కృష్ణుడు ధర్మ మార్గం అనుసరించమని చెప్పాడు. ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడి బాధ్యతలు, మానవజాతి పట్ల తన విధులను గుర్తు చేశాడు. యుద్ధరంగంలో అన్న, తమ్ముడు, మనవడు అనే తేడాలు ఉండవని ధర్మ ప్రకారం నడుచుకోవాలని చెప్పాడు.
సమానత్వం: తన భక్తులందరినీ ఒకేతీరుగా ప్రేమిస్తాడు ఆ కృష్ణుడు. వర్గబేధం, లింగ బేధాలేవీ చూపకుండా వారిని అంగీకరిస్తాడు. తద్వారా మానవజాతికి సమానత్వాన్ని బోధిస్తాడు. ఈ తరహాలోనే.. మనం కూడా ఇతరులను గౌరవంగా చూడటం, సమానంగా చూడడం, సహనంగా ఉండటం, అందరినీ ప్రేమించడం వంటివి ఆ గోపాలుడి నుంచి నేర్చుకోవల్సిన జీవిత పాఠాలు.
చూశారుగా.. ఆ లీలా కృష్ణుడి జీవితం ద్వారా మనం నేర్చుకొని, పాటించాల్సిన కొన్ని పాఠాలివి. మరి, కృష్ణుడు నేర్పిన ఈ సత్యాలను మీ జీవితంలో మీరూ అనుసరించండి.
శాపానికి ఉపశమనం- ఆంజనేయ స్వామి జననం- హనుమంతుడి జన్మ రహస్యం తెలుసా? - Hanuman Jayanthi 2024