Laxmi Puja Margashirsha Masam : ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో ప్రజలందరూ ఇళ్లను గోమయంతో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి అందరూ కలిసి ఒక చోట చేరి, లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో 'మహర్షి! ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి' అన్నారు.
'గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది' అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు 'మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి' అనగానే పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు.
భూ లోకానికేగిన శ్రీలక్ష్మి
ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో 'స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను'అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృతభూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీ దేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు.
ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి 'అవ్వా! ఈ రోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ. ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్ట లేదేంటి?' అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ 'అమ్మా! ఆ వ్రతం ఏమిటి? ఏలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను' అని అడుగగా మహలక్ష్మీ మందహాసంతో ఈ విధంగా పలికింది.
మార్గశిర లక్ష్మివారం ఆచరించాల్సిన విధివిధానాలు వివరించింది లక్ష్మీదేవి. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి, ఇల్లు గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, లక్ష్మీ దేవి పాద ముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని, దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్ర ఉంచి, పసుపు నీటితో కడిగిన పోకచెక్క ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి, ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా, నేతితో చేసిన పిండి వంటలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి.
మార్గశిర గురువారం ఇవి మర్చిపోవద్దు
గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మీ నిలువదు. ఏ స్త్రీ గురువారం శుచిగా, మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది. పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానంతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీ దేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది' అని లక్ష్మీ దేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది.
లక్ష్మీదేవి గ్రామ సంచారం
లక్ష్మీదేవి గ్రామంలో సంచరించడానికి వెళ్లిన సమయంలో ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ఇంటిని గోమయంతో అలికి, ముగ్గులు పెట్టింది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీ దేవి పాదముద్రలను వేసి, లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర దీపం పెట్టి, ధూపం వేసి, నైవేద్యాలు పెట్టి, పద్మాసనం లో కూర్చుని లక్ష్మీ పూజ చేయసాగింది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మీ ఆమె ఇంట పాదాలు మోపింది.
'ఓ భక్తురాలా! నీ భక్తి మెచ్చాను. వరం కోరుకో, ప్రసాదిస్తాను' అని పలికింది. సాక్షాత్ లక్ష్మీ దేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాకా ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి 'నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకల సంపదలను అనుభవించి మరణం తరువాత వైకుంఠాన్ని చేరుతావు' అని వరాలిచ్చింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగభాగ్యాలు, ఐదుగురు కుమారులతో ఆనందంగా గడిపింది' అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మీ చే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను చదవడం వలన సకల శుభాలు కలుగుతాయని శాస్త్రవచనం.
ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.