Krishnashtami 2024 Date and Time: హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, అష్టమి రోహిణి, గోకులాష్టమి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. విష్ణు మూర్తి.. పది అవతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడని పురాణోక్తి. ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో గోపాలుడి జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది? శుభ ముహూర్తం ఎప్పుడు? అనే విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. మరి, దానికి కారణం ఏంటి? అసలు జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జన్మాష్టమి ఎప్పుడు?:
When Krishnashtami in 2024: ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఆగస్టు 26న జరుపుకోవాలని కొందరు చెబుతున్నారు. లేదు లేదు.. ఆగస్టు 27న జరుపుకోవాలి అన్నది మరికొందరి భావన. ఈ పరిస్థితి కారణం ఏమంటే.. ఆ తిథి రెండు రోజులనూ కలుపుతూ వచ్చింది. పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథి ఆగస్టు 26న తెల్లవారుజామున 3:39 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27వ తేదీ తెల్లవారుజామున 2:19 గంటలకు ముగుస్తుంది. ఇక రోహిణి నక్షత్రం ఆగస్టు 26 సోమవారం మధ్యాహ్నం 03:55 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 03:38 గంటలకు ముగుస్తుంది. అయితే కృష్ణాష్టమి అనేది రెండు రకాలుగా ఉంటుందని.. అందులో ఒకటి స్మార్త కృష్ణాష్టమి, రెండవది వైష్ణవ కృష్ణాష్టమి అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
స్మార్త కృష్ణాష్టమి అంటే ?: శివుడిని, విష్ణమూర్తిని ఇద్దరినీ పూజించే వారిని 'స్మార్తులు' అని అంటారు. అలాగే ఆది శంకరాచార్యుల వారిని ఆరాధించే వారిని కూడా స్మార్తులు అని అంటారు. వీరు స్మార్త కృష్ణాష్టమిని ఆగస్టు 26వ తేదీ సోమవారం రోజున జరుపుకోవాలని మాచిరాజు కిరణ్ కుమార్ సూచిస్తున్నారు.
వైష్ణవ కృష్ణాష్టమి ?: కేవలం వైష్ణవ సంప్రదాయం పాటించే వారు ఆగస్టు 27 మంగళవారం రోజున కృష్ణాష్టమిని జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇలా కృష్ణాష్టమికి రెండు తేదీలు ఉండడానికి స్మార్తులకు, వైష్ణువులకు సిద్ధాంతాలు వేరుగా ఉండడమే కారణమని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
స్మార్త సిద్ధాంతం ఏంటంటే.. ఎప్పుడైనా కృష్ణాష్టమి వచ్చినప్పుడు కృత్తికా నక్షత్రం, రోహిణీ నక్షత్రం ఈ రెండూ కలిసి వచ్చినా సరే వీరు కృష్ణాష్టమి జరుపుకుంటారు. స్మార్తులకు సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉండాలన్న నియమం లేదు. ఆ రోజులో ఎప్పుడైనా సరే రోహిణీ నక్షత్రం ఉంటే స్మార్తులు కృష్ణాష్టమి జరుపుకుంటారు.
వైష్ణవుల సంప్రదాయం ఏంటంటే ?: వైష్ణవులకు కచ్చితంగా సూర్యోదయ సమయానికి రోహిణీ నక్షత్రం ఉండాలి. కృత్తికా నక్షత్రంతో కలవని రోహిణీ నక్షత్రం ఉండాలి. అందుకే విష్ణుమూర్తిని మాత్రమే పూజించేవారు ఆగస్టు 27వ తేదీ మంగళవారం రోజున శ్రీకృష్ణాష్టమిని జరుపుకోవాలని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. కాబట్టి ఆగస్టు 26న కృష్ణాష్టమి, ఆగస్టు 27న ఉట్టి కొట్టే కార్యక్రమం జరుపుకోవాలని సూచిస్తున్నారు.
కృష్ణుడి పూజ ఎప్పుడు చేసుకోవాలి ?: పురాణాల ప్రకారం.. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు. కాబట్టి, 2024, ఆగస్టు 26వ తేదీన అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాల నుంచి అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాల మధ్యలో కృష్ణుడి పూజ చేసుకోవాలని మాచిరాజు కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
ఉపవాస దీక్షలు.. కృష్ణాష్టమి నాడు భక్తులు వారి ఇళ్లను అలంకరిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి, సాయం కాలం శ్రీ కృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, రుచికరమైన వంటకాలు తయారు చేసి స్వామికి నైవేద్యం పెడతారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని అలంకరించి.. ఊయలలు కట్టి అందులో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ లేదా ‘ఉట్ల తిరునాళ్లు' అని పిలుస్తారు. అయితే.. కృష్ణాష్టమి వేడుకలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర-బృందావనంలో జరుగుతాయి. ఇక్కడ కృష్ణుడు జన్మించాడని, అతని బాల్యాన్ని ఎక్కువుగా ఇక్కడే గడిపాడని ప్రసిద్ధి.
Note: పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవి కూడా చదవండి :
కోరికలు తీరాలని వేంకటేశ్వర స్వామికి "ముడుపు" కడుతున్నారా? - ఇలా కడితేనే 100% రిజల్ట్!
విద్యార్థులకు జ్ఞానప్రదాత హయగ్రీవుడు- సోమవారం ఇలా పూజిస్తే విద్యాబుద్ధులు పక్కా!