Krishna Janmashtami 2024 : కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి శుచితో పూజామందిరాన్ని శుభ్రం చేసుకొవాలి. ఇంటి గుమ్మాన్ని మామిడి ఆకులతో, పూల మాలలతో అలంకరించాలి. చిన్ని కృష్ణుని సర్వాంగ సుందరంగా అలంకరించాలి. చిన్ని కృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలి వరకు వరి పిండిలో నీళ్లు కలిపి కృష్ణుని పాదాలను చక్కగా వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ మొదలు పెడితే మంచిది.
ఉపవాసం, జాగరణ
కొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం ఉంది. అయితే ఇది తప్పనిసరి కాదు. ఎవరి ఆచారాలను వారు పాటించవచ్చు.
పూజా విధానం
బాల కృష్ణుడి విగ్రహం ముందు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
అర్ధరాత్రి పూజ - అత్యంత ముఖ్యమైన పూజ
కృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి కాబట్టి, భక్తులు ఎక్కువగా కన్నయ్యని అర్ధరాత్రి 12 గంటల తర్వాతనే పూజిస్తారు.
56 రకాల నైవేద్యాలు
ఉత్తరభారతంలో కృష్ణాష్టమి చాలా ఘనంగా జరుపుకుంటారు. కన్నయ్యకు ప్రేమతో 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు కాబట్టి కన్నయ్యకు ఇష్టమైన అటుకులు, వెన్న, మినప సున్నుండలు, కలకండ, నేతితో చేసిన లడ్డూలు వంటివి సమర్పిస్తే సరిపోతుంది. అయితే ఏ నైవేద్యం సమర్పించినా దానిమీద తులసి దళాలు మాత్రం తప్పకుండా వేయాలి. అప్పుడే ఆ ప్రసాదానికి పవిత్రత చేకూరుతుంది.
ఇవి చేయడం తప్పనిసరి
జన్మాష్టమి రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి, ఆ రాత్రికి శ్రీ కృష్ణుని లీలలు, కథల గురించి పాడుకుంటూ జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేయాలి. ఈ రోజు భాగవతంలోని దశమ స్కందం చదవాలి. ఆలయంలో అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేసిన వారికి వంశాభివృద్ధి, ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. స్కంద పురాణం ప్రకారం ఈ రోజు శ్రీకృష్ణుని అర్చిస్తే సకల పాపాలు తొలిగి మోక్షం లభిస్తుందని శాస్త్ర వచనం.
ఉట్టి కార్యక్రమం
కృష్ణాష్టమి సాయంత్రం జరిగే ఉట్టి కొట్టే ఉత్సవం కన్నుల పండుగగా కోలాహలంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో ప్రతి ఊరిలో, వీధి వాడా ఉత్సాహంగా జరుగుతుంది. చిన్న పిల్లలను కృష్ణుడిలా, గోపికల్లా అలంకరించి సందడిగా సాగే ఈ ఉట్టి ఉత్సవం చూడటానికి జనం పోటెత్తుతారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇలా!
ఈ రోజు మథుర, ద్వారకా, బృందావనం, గురువాయూర్‌లో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ దేవాలయాల్లో కూడా కృష్ణాష్టమి సంబరాలు అంబరాన్నంటుతాయి.
ఈ కృష్ణాష్టమి పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం. మన సంస్కృతీ సంప్రదాయాలను మన భావి తరాలకు భద్రంగా అందజేద్దాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.