Kashi Samba Aditya Temple : భాస్కరుడు, ఆదిత్యుడు అయిన సూర్యుని ఆరాధిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయని విశ్వాసం. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్య భగవానుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
కాశీలో వెలసిన ద్వాదశాదిత్య ఆలయాలు
శ్రీనాధుడు రచించిన కాశీ ఖండంలో వివరించిన ప్రకారం కాశీ క్షేత్రంలో ద్వాదశాదిత్య ఆలయాల పేరుతో పన్నెండు సూర్య దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అత్యంత ప్రాచీనమైనవనే విషయం స్థల పురాణాన్ని ద్వారా మనకు తెలుస్తోంది. ద్వాదశాదిత్యుల ఆలయాలలో ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది. ప్రతి ఆలయానికి ఓ గాధ ఉంది. అలాగే సాంబ కుండం ఏర్పడానికి ఉన్న గాధ ఏమిటో చూద్దాం.
సాంబ కుండం విశిష్టత
కాశీలో సూర్యకుండం సమీపంలోనే సాంబాదిత్యుని ఆలయం ఉంటుంది. సాంబుడు పేరుతో వెలసిన ఈ ఆలయానికి చరిత్ర ఉంది.
ఎవరీ సాంబుడు?
శ్రీకృష్ణుడు జాంబవతి సంతానమే ఈ సాంబుడు. పూర్వం ఒకానొక సమయంలో ఈ సాంబుడు నారద మహర్షిని అవమానిస్తాడు. నిరంతరం శ్రీహరి నామం జపిస్తూ ముల్లోకాలు తిరిగే విష్ణు భక్తుడైన నారద మహర్షిని అవమానించినందుకు సాంబుడిపై శ్రీకృష్ణుడు ఆగ్రహిస్తాడు. ఆ ఆగ్రహంతో కుమారుడు అని కూడా చూడకుండా శ్రీకృష్ణుడు సాంబుడిని కుష్ఠు వ్యాధితో బాధపడమని శపిస్తాడు.
సాంబునికి శ్రీకృష్ణుని శాపోపశమనం
తాత్కాలిక ఆవేశంతో కుమారుడిని శపించిన శ్రీకృష్ణుడు తరువాత శాంతించి, కాశీ క్షేత్రానికి వెళ్లి సూర్యుడిని ఆరాధిస్తే శాప విమోచనం కలుగుతుందని సెలవిస్తాడు.
కాశీ చేరిన సాంబుడు
శ్రీకృష్ణుని ఆదేశం మేరకు సాంబుడు కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ ఓ కుండాన్ని నిర్మించి ప్రతిరోజూ అందులో స్నానమాచరిస్తూ సూర్యారాధన చేస్తాడు. సాంబుడు నిర్మించిన కుండం కాబట్టి దానికి సాంబ కుండం అని పేరు వచ్చింది. ఇక్కడ సాంబుడు ప్రతిష్టించి సేవించిన సూర్యభగవానుడిని సాంబాదిత్యునిగా పూజిస్తారు. సాంబాదిత్యుని అనుగ్రహం వలన సాంబుని కుష్ఠు వ్యాధి తగ్గుతుంది.
కుష్టు వ్యాధి నివారణ
కాశీ క్షేత్రంలోని సాంబ కుండంలో స్నానం చేసి సాంబాదిత్యుని పూజిస్తే భయంకరమైన కుష్టు వ్యాధి నుంచి విముక్తి లభిస్తుందనే బలమైన విశ్వాసం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అందుకే కాశీకి వెళ్లే ప్రతివారు కుష్టు వ్యాధి ఉన్నా లేకపోయినా మంచి ఆరోగ్యం కోసం సాంబ కుండంలో స్నానం చేసి సాంబాదిత్యుని పూజిస్తారు. ఈసారి కాశీకి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా సాంబ కుండం దర్శించండి, తరించండి.
ఓం శ్రీ ఆదిత్యాయ నమః ఆరోగ్యం భాస్కరాదిత్యేత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం