Karthika Puranam Chapter 8 : వశిష్ఠుడు ఎనిమిదవ రోజు కథను ప్రారంభించబోవుచుండగా జనకుడు "ఓ మునిశ్రేష్టా! ఇప్పటి వరకు తమరు చెప్పినది శ్రద్దగా విన్నాను. కానీ నన్ను ఒక సందేహం పట్టి పీడిస్తున్నది. అది ఏమిటంటే ఎన్నో యజ్ఞ యాగాదులు చేస్తే తప్ప చేసిన పాపములు పోయి మోక్షం కలుగదని మీవంటి పెద్దలే తెలియచేసితిరి కదా! మరి అటువంటప్పుడు కేవలం నదీస్నానం, దీపారాధన, దీపదానం, ఉపవాసం, పురాణ శ్రవణం, వనభోజనం వంటి స్వల్ప ధర్మముల చేత ఏ విధముగా పాపములు నశించి, మోక్షం కలుగును? ఈ విషయమును నాకు వివరంగా చెప్పమని ప్రార్ధించుచున్నాను". అని కోరెను.
అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి "దేశకాలపాత్రలు అనుకూలిస్తే తెలిసిగాని, తెలియకగాని భగవంతుని నామము చెప్పిన వారి సకల పాపములు పోయి ముక్తి కలుగును. ఇందుకు ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు చెబుతాను శ్రద్దగా ఆలకింపుము" అంటూ ఇలా చెప్పసాగెను.
అజామిళోపాఖ్యానం
పూర్వకాలము నందు కన్యాకుబ్జమను నగరమున నాలుగు వేదాలు చదివిన సత్యవ్రతుడను ఒక విప్రుడు కలడు. అతనికి సకల సద్గుణాల రాసి అయిన హేమవతి అను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమతో జీవిస్తూ, అపూర్వ దంపతులని పేరు పొందారు. వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు కలిగెను. వారు ఆ బాలునికి అజామిళుడు అని పేరు పెట్టి అతి గారాబముగా పెంచుకొనుచుండెను. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు, అతి గారాబము వల్ల దుష్ట సహవాసములు మరిగి, విద్యాభ్యాసం చేయక, బ్రాహ్మణ ధర్మములు పాటింపక భ్రష్టుడై తిరుగుచుండెను.
బ్రాహ్మణ ధర్మాలు విడిచి భ్రష్టుడైన అజామిళుడు
ఇలా కొంత కాలము జరుగగా అజామిళుడు యవ్వనవంతుడైన తరువాత కామాంధుడై, మంచిచెడ్డలు మరిచి, యజ్ఞోపవీతం తెంచి వేసి, మద్యం సేవించుచూ, ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడలు సలుపుతూ, ఇంటికి కూడా రాకుండా, తల్లిదండ్రులు మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను. ఆ రకంగా కులభ్రష్టుడైన అజామిళుని అతని బంధువులు విడిచి పెట్టిరి. దీనితో మరింత రెచ్చిపోయిన అజామిళుడు వేటగాడుగా మారి ఎరుకుల స్త్రీతో కలిసి అడవిలో పక్షులను, జంతువులను వేటాడుతూ జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఎరుకల స్త్రీ అడవిలో చెట్టు కొమ్మపై నుంచి పడి ప్రమాదవశాత్తు మరణించింది. అంత అజామిళుడు ఆమె కోసం కొంతసేపు దుఃఖించి తరువాత ఆమెను దహనం చేసి తిరిగి ఇంటికి వచ్చాడు.
చేయరాని పాపానికి ఒడిగట్టిన అజామిళుడు
అప్పటికే వారికి ఒక కుమార్తె ఉండేది. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్తవయసు రాగా, అజామిళుడు కన్నకుమార్తెను కూడా చెరపట్టి ఆమెతో కూడా కామక్రీడలు సలుపుచుండెను. వారికి ఇద్దరు కుమారులు పుట్టి ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు. మూడవసారి పుట్టిన వానికి నారాయణుడని నామకరణం చేసి ప్రేమగా పెంచుకొనుచుండెను. ఎప్పుడు 'నారాయణ', 'నారాయణ' అని పిలుస్తూ, ఆ విధముగా స్మరించడం వలన పాపములు నశించును అని తెలియకుండానే పిలుస్తుండేవాడు.
అజామిళుని అవసానదశ
కొంతకాలమునకు అజామిళుడు వార్ధక్యమున రోగగ్రస్తుడై మంచము పట్టెను. అంత్యకాలము సమీపించగా యమభటులు భయంకర ఆకారములతో, పాశములతో ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామిళుడు భయముతో, పుత్ర వాత్సల్యముతో "నారాయణ, నారాయణ" అని అంటూనే ప్రాణములు విడిచెను.
నారాయణ మంత్రం ప్రభావం
'నారాయణ' శబ్దం వినగానే యమభటులు గడగడా వణికిపోయారు. ఇంతలో దివ్యమంగళాకారులు అయిన, శంఖ చక్ర గదాధారులైన శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో వచ్చి "ఓ యమ భటులారా! వీడు నారాయణ నామం పలకడం వల్ల ఇతని సర్వ పాపములు పటాపంచలైనాయి. ఇతను ఇప్పుడు వైకుంఠ వాసమునకు అర్హుడు" అని చెప్పి అతనిని వైకుంఠమును తీసుకొనివెళ్ళారు. కాబట్టి ఓ జనక మహారాజా చూసావుగా నారాయణ నామస్మరణకు ఎంతటి మహత్యం ఉందో!" అని వశిష్ఠుడు జనకునితో చెబుతూ ఎనిమిదవ రోజు కథను ముగించాడు.
ఇతి స్మాంద పురాణ కార్తీకమహాత్మ్యే అష్టమాధ్యాయ సమాప్తః
ఓం నమః శివాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.