Kamada Ekadashi 2024 : హిందువులకు ఏకాదశి తిథి పరమ పవిత్రమైనది. ఏకాదశి రోజు, ఉపవాసం, జాగరణ చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని శాస్త్ర వచనం. అయితే ఏకాదశి వ్రతం ఆచరించడం కొంత కష్టమైన పని అయినా దీక్షతో ఆచరించడం మొదలు పెడితే అనేక శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్ర వచనం.
కోరికలు తీర్చే కామదా ఏకాదశి
చైత్రశుద్ధ పున్నమి ముందు వచ్చే ఏకాదశిని 'కామదా' ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు నియమనిష్టలతో ఉపవాసం, జాగరణ చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని శాస్త్రం చెబుతోంది.
ఏకాదశి పూజావిధానం
ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని వీలైతే నదీస్నానం చేయాలి . వీలు కాకుంటే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో సమస్త పుణ్యనదులను ఆవాహన చేసుకుని స్నానం చేయాలి. అనంతరం దీపారాధన, దైవారాధన చేసుకొని తమ తమ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవాలి. వీలైతే దేవాలయ సందర్శన చేయవచ్చు. వీలుకాని వారు నారాయణ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉంటే చాలు. ఏకాదశి రోజు గోపూజ చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. సాయంత్రం వేళ తిరిగి స్నానం చేసి దీపారాధన పూజ చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి?
ఉపవాసం అనే పదానికి ఉప - వసించడం అనే అర్థం ఉంది. అంటే ఏకాదశి రోజున మనం సాధారణంగా చేసే నిత్యకృత్యాలను పక్కన పెట్టి భగవంతునికి దగ్గరగా వసించాలి. ఈ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఏకాదశి ముందు రోజు అయిన దశమి రోజు రాత్రి కేవలం అల్పాహారం మాత్రం తీసుకొని ఏకాదశి ఘడియలు మొదలైనప్పటి నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండాలి.
నిర్జల ఉపవాసం
కొంతమంది నిష్టాగరిష్టులు నీటిని కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. అయితే ఇవన్నీ ఉపవాసం చేసే వారి ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు మితంగా సాత్వికాహారం తీసుకోవచ్చని పెద్దలు చెబుతారు. అంటే పండ్లు, పాలు వంటివి అన్నమాట!
ఏకాదశి జాగారం ఎలా చేయాలి?
ఏకాదశి ఉపవాసం చేసే వారు జాగరణ చేయాలన్న నియమమేమి లేదు. జాగారం చేయగలిగిన వాళ్ళు చేయవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. జాగారం పేరిట వ్యర్ధ ప్రసంగాలు చేయరాదు. మనసు చలించే చలనచిత్రాలు చూడరాదు. జాగారం చేయాలనుకునే వారు భక్తితో శ్రీమన్నారాయణుని భజనలు కీర్తనలు పూజలు చేస్తూ కాలక్షేపం చేయాలి. అలా కుదరనప్పుడు జాగారం చేయకపోవడమే మేలు!
ద్వాదశి పారణ - అతిధి దేవోభవ!
ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి ఘడియలు రాగానే స్నానం చేసి శుచిగా వంట చేసి మహా నైవేద్యాన్ని దేవునికి నివేదన చేయాలి. అనంతరం అతిథికి భోజనం పెట్టాలి. ఒకవేళ అతిథి లేకపోతే ఇంటి బయట ఏదైనా జీవికి ఆహారాన్ని విడిచి పెట్టి తర్వాత తాను భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.
ఉపవాసం ఇలా చేస్తేనే ఫలితం
ఏకాదశి ఉపవాసం చేసే వారు ఉపవాసం సమయంలో దానగుణం, దయ గుణం కలిగి ఉండాలి. ఎవరితోనూ కోపంగా మాట్లాడకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. మద్య మాంసాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. సహనం లేనివారు. నిష్ఠ లేనివారు ఉపవాసం చేయకపోవడమే మంచిది.
భక్తే ప్రధానం
ఏకాదశి ఉపవాసానికి భక్తే ప్రధానం. భక్తి లేకుండా ఎంత పెద్ద పూజలు చేసినా, ఎన్ని ఉపవాసాలు, జాగారాలు చేసినా ఫలితం ఉండదు. భగవంతుడు కోరుకునేది భక్తి మాత్రమే. నిర్మలమైన మనస్సుతో దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించే శక్తి ఉన్నవారు మాత్రమే ఏకాదశి ఉపవాసం చేయాలి. భక్తిశ్రద్ధలతో ఏకాదశి ఉపవాసం చేస్తే అనంతకోటి పుణ్య ఫలం లభిస్తుంది.
ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న శాస్త్రీయత
సాధారణంగా మన జీర్ణక్రియ సక్రమంగా పని చేయాలంటే నెలకు ఒక్కసారైనా ఏమి తినకుండా కేవలం నీరు మాత్రమే తాగుతూ ఉంటే శరీరంలోని వ్యర్ధ పదార్ధాలన్నీ బయటకు పోయి జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. శరీరం నూతనోత్తేజం పుంజుకుంటుంది. మన పెద్దలు ఏర్పాటు చేసిన పూజలు వ్రతాలు వెనుక గొప్ప ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి. మనమందరం కూడా ఇలా ఏకాదశి ఉపవాసాలు చేద్దాం. పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా పొందుదాం!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.