Jammi Chettu Puja Benefits In Telugu : సహజంగా మన ఇంట్లో మనకు తెలియకుండానే కొన్ని వాస్తు దోషాలు ఉంటాయి. తెలిసో తెలియకో జరిగే ఈ తప్పులకు పరిహారంగా ఇంట్లో జమ్మిచెట్టును పెంచుకుంటే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జమ్మి చెట్టు శనీశ్వరుడికి సంబంధించినదిగా తెలుస్తోంది. ఇంట్లో సానుకూల శక్తుల కోసం మనం అనేక రకాల మొక్కలను పెంచడం సర్వ సాధారణం. అయితే శనీశ్వరుడి చెట్టుగా భావించే జమ్మి చెట్టును ఇంట్లో పెంచుకోవడం వలన మన ఇళ్లలో ఆనందం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయని విశ్వాసం.
జమ్మి చెట్టు ఎక్కడ నాటాలంటే?
వాస్తు శాస్త్రం సూచించిన ప్రకారం శమీ చెట్టును ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున నాటితే శుభకరమని తెలుస్తోంది. ఒకవేళ ప్రధాన ద్వారం వద్ద జమ్మిచెట్టుని నాటడానికి సరిపడా స్థలం లేకపోతే మేడమీద దక్షిణం వైపు జమ్మి చెట్టును నాటడం సకల శుభాలను ఇస్తుందని శాస్త్ర వచనం.
జమ్మి చెట్టు ఏ రోజు నాటితే మంచిది?
వాస్తు శాస్త్రం ప్రకారం జమ్మిచెట్టును విజయదశమి రోజు నాటడం అత్యుత్తమం. కాదంటే శనివారం రోజు జమ్మి చెట్టును నాటవచ్చు. శనివారం జమ్మి చెట్టును నాటడం వలన శనీశ్వరుని అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.
జమ్మిచెట్టును ఎలా పూజించాలి?
సానుకూల శుభ ఫలితాల కోసం నిత్యం జమ్మి చెట్టుకు నీరు పోసి సంరక్షించాలి. క్రమం తప్పకుండా జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ, పసుపు కుంకుమలతో పూజించాలి. సాయం సంధ్యా సమయంలో జమ్మి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నా, అర్ధాష్టమ శని, అష్టమ శని వలన కలిగే దుష్ప్రభావాలు పోతాయని విశ్వాసం.
రాహువు అనుగ్రహం కోసం!
శనివారం, సోమవారం జమ్మిచెట్టుకు కొమ్మను పసుపుకుంకుమలతో పూజించి, ఎర్ర కలువ పూలతో శమీ చెట్టు మంత్రాలను జపిస్తూ పూజిస్తే జాతకంలో బలహీనంగా రాహు స్థానం బలపడుతుందని విశ్వాసం. జాతక దోషాల వలన కలిగే దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచిస్తున్నారు.
మొక్కలను, చెట్లను పూజించడం మన సంప్రదాయం. ఒక రకంగా మన పూర్వీకులు ఈ పద్ధతులు పెట్టడం వెనుక పర్యావరణ పరిరక్షణ కూడా దాగి ఉంది. కొన్ని రకాల మొక్కలు ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తాయి. ఉదాహరణకు తులసి, మామిడి, రావి, జమ్మి, వేప చెట్లు వంటివి. అందుకే మనం నివసించే చుట్టుపక్కల ఇలాంటి చెట్లను పెంచడం మంచిది. పూజల పేరుతో నిత్యం వాటికి నీళ్లు పోస్తూ, అవి ఎండిపోకుండా సంరక్షించడం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగమే! ఏది ఏమైనా మన పెద్దలు గురువులు చెప్పినట్లుగా జమ్మి చెట్టును పూజించి జాతకంలో దుష్ప్రభావాలను తొలగించుకుందాం. సుఖ సంతోషాలను, సకల శ్రేయస్సును పొందుదాం. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.