How to Reach Shrigonda Siddhivinayak Temple : మహారాష్ట్రంలో వెలసిన అష్ట వినాయక క్షేత్రాలను ఓ క్రమ పద్ధతిలోనే దర్శించుకోవాలి. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ పూర్తి చేస్తేనే ఈ అష్ట వినాయక క్షేత్ర దర్శన ఫలం దక్కుతుంది. గత వారం తొలి క్షేత్రం మయూర గణపతి క్షేత్ర విశేషాలను తెలుసుకున్నాం. ఈ రోజు రెండవ సిద్ధి వినాయక క్షేత్రం గురించి తెలుసుకుందాం.
సిద్ధి వినాయక క్షేత్రం ఎక్కడ ఉంది
సిద్ధి వినాయక క్షేత్రం మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలోని శ్రీగొండ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక చిన్న కొండ మీద వెలసి ఉంది. అష్ట వినాయక క్షేత్రాలలో రెండవ క్షేత్రంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలోని గణపతికి ఓ ప్రత్యేకత ఉంది.
వక్రతుండ మహాకాయ!
సాధారణంగా అన్ని గణపతి ఆలయాల్లో వినాయకుడి తొండం కుడి వైపుకు తిరిగి ఉంటుంది. కానీ సిద్ధి వినాయక క్షేత్రంలో మాత్రం గణపతి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత!
సిద్ధి బుద్ధి ప్రదాత
సిద్ధివినాయక క్షేత్రంలో గణపతి సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. తన దర్శనానికి వచ్చిన భక్తులకు కార్యసిద్ధిని, మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు ఈ గణపతి.
ఆలయ స్థల పురాణం
శ్రీమహావిష్ణువు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. ఆ క్రమంలో మధు, కైటభులనే రాక్షసులను సంహరించే సమయంలో శ్రీ మహావిష్ణువు ఈ వినాయకుని సహాయం తీసుకున్నాడట! రాక్షస సంహారం తర్వాత శ్రీమహావిష్ణువు గణనాథుని పట్ల కృతజ్ఞతతో తానే స్వయంగా గణనాథుని ప్రతిష్ఠించి వినాయకునికి ఇక్కడ ఆలయం నిర్మించాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
గిరి ప్రదక్షిణం శుభప్రదం
ఇక్కడ వినాయకుడు వెలసిన కొండకు గిరి ప్రదక్షిణం చేయడం ద్వారా సకల మనోభీష్టాలు నెరవేరుతాయని, పనుల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సిద్ధి వినాయక క్షేత్రంకు దర్శనానికి వచ్చిన భక్తులు చాలామంది కోరికలు నెరవేరడానికి భక్తితో గిరి ప్రదక్షిణం చేస్తారు. సుమారు అరగంటసేపు పట్టే ఈ గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు గణనాథుని కొట్టే జేజేలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోతుంది.
ఎలా చేరుకోవచ్చు
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పుణెకు కానీ ముంబయికి కానీ రైలు, విమాన సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ నుంచి అహ్మద్నగర్ జిల్లాకు సులభంగా చేరుకోవచ్చు.
కార్యసిద్ధి, విజయాన్ని అందించే సిద్ధి వినాయక క్షేత్రం మనం కూడా దర్శించుకుందాం. మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం.
జై బోలో గణపతి మహారాజ్ కి జై!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
విష్ణుమూర్తే కాదు, శివుడు కూడా 10 అవతారాలు ఎత్తారు- వాటి గురించి తెలుసా? - Shiva Avatars Names