Tulasi Puja in Sravana Masam: శ్రావణ మాసంలో ముత్తైదువులందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. విష్ణువుకు ప్రీతికరమైన మాసం ఇది. అలాగే మహిళలు మంగళగౌరీ వ్రతం, వరాల తల్లి వరలక్ష్మీ దేవి వత్రాలను ఆచరిస్తారు. అంతేకాకుండా శ్రావణ మాసం మొత్తం తులసి కోట వద్ద ఉదయం, సాయంత్రం మహిళలు పూజలు చేస్తారు. అయితే.. మామూలుగా కాకుండా శ్రావణ మాసంలో తులసి పూజ ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని.. ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, ధనాకర్షణ లభిస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. మరి ఆ పూజా విధానం ఎలానో ఇప్పుడు చూద్దాం..
పూజా విధానం:
- శ్రావణ మాసంలో ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం తులసి కోట వద్ద మహిళలు పూజలు చేయాలి.
- అందుకోసం.. ముందుగా తులసి కోట వద్ద శుభ్రం చేసుకోవాలి. బియ్యపు పిండితో కొన్ని ముగ్గులు వేయాలి.
- అందులోనూ శంఖం, చక్రం, పద్మం, స్వస్తిక్ .. ఈ గుర్తులు కలిగిన ముగ్గులు లేదంటే.. అష్టదళ పద్మం ముగ్గు శ్రావణ మాసంలో తులసి కోట వద్ద వేయాలి.
- ఆ తర్వాత తులసి కోట వద్ద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపారాధన చేయాలి.
- అనంతరం తులసి కోటలో గులాబీలు లేదా తెల్లటి పూలతో పూజిస్తూ ఓం బృందావన్యై నమః అని 21 సార్లు మంత్రం జపించాలి.
- ఆ తర్వాత తులసి కోట చుట్టూ 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి.
- చివరగా తులసి మాతకు నైవేద్యంగా అరటి పండు ముక్కలు, దానిమ్మ గింజలు సమర్పించాలి. ఈ రెండూ తులసి మాతకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు.
- ఇలా శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే సంపూర్ణంగా మాత అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని చెబుతున్నారు.
ఇవీ చేయండి:
- అలాగే శ్రావణ మాసంలో ప్రతి రోజూ 108 కలిగిన తులసి మాలికతో జపం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణు మంత్రాల్లో "ఓం నమో నారాయణాయ" లేదా "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ఈ రెండింటిలో ఏదో ఒక మంత్రాన్ని జపిస్తూ 108 లేదా 54 లేదా 21 సార్లు తులసి మాలికతో జపిస్తే అద్భుతమైన విజయాలను పొందవచ్చట.
- అలాగే శ్రావణ మాసంలో తులసి మాలికను ధరించినా కూడా మంచి జరుగుతుందని మాచిరాజు కిరణ్ కుమార్ అంటున్నారు. అయితే జపం చేయడానికి, ధరించడానికి వేరు వేరు తులసి మాలికలు ఉపయోగించాలంటున్నారు. శ్రావణంలో తులసి మాలికలను ధరించిన వారికి నిద్రకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయని, పీడ కలలు రావని, పాండిత్యం పెరుగుతుందని అంటున్నారు. అలాగే విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షల్లో రాణించాలంటే మెడలో తులసి మాలికలు ధరించాలని అంటున్నారు.
- మంచి గుర్తింపు రావాలన్నా, ధనాకర్షణ రావాలన్నా శ్రావణ మాసంలో తులసి మాలికలు ధరించాలని చెబుతున్నారు.
వరలక్ష్మీ వ్రతం రోజున ఈ బొమ్మ పూజగదిలో ఉంటే - మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది! - Varalakshmi Vratham