Why Hanuman Is Chiranjeevi : మంగళవారం హనుమ ఆరాధనకు విశిష్టమైనది. పవనసుత హనుమకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆంజనేయుడని, భజరంగ బలి అని, మారుతి అని, సంకట్ మోచనుడని రకరకాల పేర్లు ఉన్నాయి. అయితే, ఒక్కో పేరు వెనుక ఒక్కో గాథ ఉంది. హనుమకు చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈనాటికీ హనుమ హిమాలయాల్లో సూక్ష్మ రూపంలో తపస్సు చేసుకుంటూ చిరంజీవిగా ఉన్న సంగతి తెలుసా? అసలు హనుమ చిరంజీవి ఎలా అయ్యాడు? ఆ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంజనేయుడు చిరంజీవి ఎలా అయ్యాడో తెలుసా?
వాల్మీకి రామాయణం ప్రకారం సీతారాముల వనవాసం సమయంలో రావణాసురుడు మాయావిలా వచ్చి సీతను అపహరించుకుపోతాడు. సీత జాడ తెలియక శ్రీరాముడు దుఃఖంతో అరణ్యమంతా గాలిస్తాడు. అలా వెతుకుతూ వెళ్తున్న రాముడు సుగ్రీవుని కలుసుకుంటాడు. సుగ్రీవుడు తానూ, తన వానర సేన అంతా కలిసి సీతమ్మ వారి జాడ తెలుసుకుంటామని అభయమిచ్చి రాముడిని ఓదారుస్తాడు.
నలు దిక్కులకు వానర సైన్యం
ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడు తన సైన్యాన్ని నలు దిక్కులా పంపిస్తాడు. సుగ్రీవుని సైన్యంలో అందరి కంటే బలశాలి అయిన హనుమ దక్షిణ దిక్కుకి వెళ్తాడు. సముద్రాన్ని దాటి రావణ రాజ్యమైన లంకా పట్టణానికి చేరుకుంటాడు. లంకలో అశోకవనంలో శోకంతో ఉన్న సీతమ్మ తల్లిని చూసి హనుమ తాను శ్రీరాముని దూతను అని, రాముని ఆజ్ఞ మేరకే సీతాన్వేషణకై వచ్చానని చెప్తాడు. సీతమ్మకు నమ్మకం కలిగించడానికి శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని చూపిస్తాడు.
హనుమను ఆశీర్వదించిన సీతమ్మ
హనుమంతుడు ఇచ్చిన ఆనవాలు చూసిన సీతాదేవి, హనుమ శ్రీరాముని బంటు అని నమ్ముతుంది. హనుమంతుని హృదయంలో రాముని పట్ల ఉన్న అపారమైన ప్రేమకు, భక్తికి ముగ్ధురాలైన సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా మరణంలేని వ్యక్తిగా జీవించమని ఆశీర్వదించింది.
అయితే, హనుమంతుని అమరత్వం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నప్పటికినీ వాల్మీకి రామాయణంలోని ఈ కథనే అందరూ ప్రామాణికంగా తీసుకుంటారు. ఆనాటి నుంచి హనుమంతుడు చిరంజీవిగా భూమిపైనే ఉన్నాడని విశ్వాసం. హిమాలయాల్లో హనుమంతుని పాద ముద్రలు కూడా గుర్తించినట్లుగా కొందరు చెప్పుకోవడం వెనుక నిజమెంత ఉందో తెలియదు కానీ రామాయణానికి తలమానికమైన ఈ ఘట్టం సుందరకాండలో ఉంటుంది. ఈ ఘట్టాన్ని చదివినా, విన్నా ఎంతటి కష్టమైనా తొలగిపోతుందని అంటారు.
జై శ్రీరామ్! జై చిరంజీవ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.