Ganga Sapthami Puja Vidhanam : వైశాఖ శుద్ధ సప్తమి గంగా సప్తమిగా ఖ్యాతి కెక్కింది. గంగాదేవి ఈ రోజు తిరిగి భూమిపైకి వచ్చిందని, అందుకే ఇది గంగా దేవికి పునర్జన్మ అని అంటారు. ఈ ఏడాది మే 14న గంగా సప్తమి జరుపుకోబోతున్నాం. భగీరథుడు గంగానదిని భూమిపైకి తీసుకు వచ్చిన తర్వాత గంగ జహ్ను మహర్షి ఆశ్రమం మీదుగా ప్రవహించినప్పుడు ఆ ఆశ్రమం అంతా నీటి మయమై పోతుంది. అందుకు ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగను అవపోసన పట్టి మింగేస్తాడు. అనంతరం భగీరధుని అభ్యర్ధన మేరకు వైశాఖ శుద్ధ సప్తమి రోజున జహ్ను మహర్షి గంగను తన చెవి నుంచి విడిచి పెడతాడు. అందుకే ఇది గంగా దేవికి పునర్జన్మ అని అంటారు. జహ్ను మహర్షి చెవి నుంచి ప్రవహించింది కాబట్టి గంగకు ఆనాటి నుంచి జాహ్నవి అని పేరు వచ్చింది. ఇది గంగా సప్తమి వెనుక ఉన్న గాథ.
శ్రీఘ్ర వివాహం కోసం పరిహారాలు
గంగా సప్తమి రోజు వివాహం ఆలస్యమవుతున్న వారు గంగాజలంతో 5 బిల్వ దళాలు వేసి ఆ నీటితో పరమ శివునికి అభిషేకం చేస్తే గంగశివులు ఇద్దరు సంతృప్తి చెంది ఇచ్చిన దీవెనలతో వివాహంలో ఆటంకాలు తొలగిపోయి శీఘ్రంగా వివాహం జరుగుతుంది.
విజయాలనిచ్చే గంగా సప్తమి
జీవితంలో పదే పదే విఫలమవుతూ ఏ పనిలోనూ విజయం సాధించలేని వారు గంగా సప్తమి రోజు ఒక రాగి పాత్రలో గంగాజలం తీసుకొని అందులో కొన్ని పాలు పోసి గంగామాత మంత్రాలను నిష్టగా జపించి ఆ నీటిని ఇంట్లో అయితే తులసిమొక్కలో, లేదంటే నదిలో కలపాలి. అనంతరం గంగామాతకు కర్పూర హారతి ఇస్తే జీవితంలో తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఈ పరిహారం గంగానది ఒడ్డున చేయడం శ్రేష్టం. వీలుకానివారు తమ సమీపంలోని ఏ నది వద్ద అయినా చేయవచ్చు.
మోక్షమార్గం
గంగా సప్తమి రోజు వీలైన వారు పవిత్ర గంగానదిలో స్నానమాచరిస్తే కలిగే పుణ్యం అనంతం. అలా చేయలేని వారు తాము స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. అనంతరం పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేస్తే మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయని శాస్త్ర వచనం. చివరగా వరదలు, అతివృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో జహ్ను మహర్షిని తలచుకుంటే ఆపదలు తొలగిపోతాయని అంటారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శ్రీరామ నవమి అందరికీ తెలుసు - సీతా నవమి తెలుసా? - ఆ శుభసమయం ఈ నెలలోనే! - Sita Navami 2024