Ganesh Chaturthi Puja Vidhi Telugu : స్కందపురాణం, బ్రహ్మ వైవర్తన పురాణం, నారద పురాణంలో వివరించిన ప్రకారం వినాయకుని తలచుకుంటే తలపెట్టిన కార్యక్రమం ఏదైనా దిగ్విజయంగా సాగుతుంది. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు దేశంలోని ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేశుని పూజించి, వీధుల్లో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవ రాత్రులను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ వినాయక చవితి పండుగను కుల మత, జాతులకు అతీతంగా జరుపుకోవడం మరో విశేషం. గణనాధుని పూజకు భక్తిశ్రద్ధలు ఎంత ప్రధానమో పూజలో పొరపాట్లు చేయకుండా ఉండడం కూడా అంతే ప్రధానం. వినాయక చవితి పూజ శాస్త్రోక్తంగా ఎలా చేయాలో చూద్దాం.
వినాయక చవితి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షంలో చతుర్థి తిథి 6 సెప్టెంబర్ 6, 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభం కానుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 7, 2024 శనివారం సాయంత్రం 5:37 గంటలకు ముగియనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండుగ చేసుకోవాలి కాబట్టి వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7న చేసుకోవాలి.
వినాయక చవితి పూజకు శుభ సమయం
సెప్టెంబర్ 7 శనివారం గణేష్ చతుర్థి రోజు ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:34 గంటల మధ్యలో పూజ ప్రారంభించేందుకు, విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూల సమయమని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ శుభ సమయంలో వినాయకుని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మరి పూజ శాస్త్రోక్తంగా ఎలా చేయాలో చూసేద్దాం.
పూజకు ఇలా సిద్ధం అవుదాం
వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించాలి. ఇంటి గుమ్మానికి మామిడాకులు తోరణాలు కట్టి, పూల మాలలతో ఇంటిని అలంకరించాలి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యం పోసి వాటిపై తామరాకును ఉంచుకోవాలి.
వినాయకుని ప్రతిష్ఠ
మట్టి గణపతిని తామరాకుపై ప్రతిష్ఠించుకోవాలి. పాలవెల్లికి పసుపు, కుంకుమలు రాసి, రకరకాల కూరగాయలతో, పండ్లతో, మొక్కజొన్న పొత్తులతో అలంకరించుకోవాలి. పాలవెల్లిని వినాయకుని శిరసుపై పందిరి లాగా వచ్చేలా అమర్చుకోవాలి. వినాయకునికి మండపానికి నలువైపులా అరటి పిలకలను అమర్చుకోవాలి. వెండి, రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో గంగాజలం, నీళ్లు పోసి, పైన టెంకాయ, జాకెట్ ముక్క ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. దీపారాధన చేసి, అగరుబత్తీలు వెలిగించాలి. అనంతరం ఆచమనం, ప్రాణాయామం చేసి పూజను మొదలు పెట్టుకోవాలి.
ముందుగా కలశంలోకి సమస్త నదీ జలాలను ఆవాహన చేసి జలంలో అక్షింతలు వేసి మామిడాకుతో మూడుసార్లు తిప్పుతూ కలశ పూజను చేసుకోవాలి. ఒక తమలపాకులో పసుపు గణపతిని చేసుకొని గణేశ షోడశ నామాలతో పూజించి బెల్లం, అరటి పండు నివేదించి హారతి ఇవ్వాలి.
వినాయక చవితి పూజ ప్రారంభం
ఇప్పుడు వినాయకుని విగ్రహానికి షోడశోపచార పూజలు చేయాలి. ముందుగా స్వామిని ఆహ్వానించి, ఆచమనం ఇచ్చి, పంచామృత స్నానం చేయించి, నూతన వస్త్రయుగ్మం, యజ్ఞోపవీతం సమర్పించి, అథాంగ పూజ సమంత్రకంగా చేయాలి. తర్వాత పూవులు, అక్షింతలు వేస్తూ అష్టోత్తర శతనామాలతో స్వామిని అర్చించాలి. తరువాత 21 రకాల పత్రితో శాస్త్రోక్తంగా పత్రి పూజను నిర్వహించాలి.
ధూప దీప దర్శనం
అనంతరం వినాయకునికి ధూపం వేసి, దీపం దర్శింపజేయాలి. ఇప్పుడు 21 రకాల పిండి వంటలు, భక్ష్య భోజ్య చోష్య, లేహ్య పానీయాలతో కూడిన మహా నైవేద్యాన్ని సమర్పించాలి. పిండివంటలలో ముఖ్యంగా ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు, గారెలు, బూరెలు ఉంటే మంచిది. చివరగా దక్షిణ తాంబూలాదులు సమర్పించి మంగళ హారతులు ఇవ్వాలి.
పూజ సమాప్తం - పునః పూజ
అనంతరం వినాయక చవితి వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. వినాయకుని సమక్షంలో గుంజీళ్లు తీయాలి. సాయంత్రం పునః పూజ చేసి వినాయకుని కొంచెం పక్కకు జరిపి ఉంచుకుంటే పక్క రోజు నిమజ్జనం చేసుకోవచ్చు. కొంతమంది 3, 5, 7, లేదా 9 రోజుల పాటు వినాయకుని పూజించి 10 వ రోజు నిమజ్జనం చేస్తారు. అది వారి ఇంటి ఆనవాయితీని అనుసరించి ఉంటుంది. ఈ విధంగా శాస్త్రోక్తంగా ఎవరైతే గణనాధుని అర్చించి పూజిస్తారో వారికి జీవితంలో తలపెట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండకుండా సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం.
ఓం శ్రీ గణాధిపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.