Margasira Masam 2024 Festivals : తెలుగు పంచాంగం ప్రకారం మొత్తం 12 నెలలు ఉన్నప్పటికినీ అందులో కొన్ని మాసాలు భగవంతుని ఆరాధనకు విశేషమైనవి. పరమ పవిత్రమైన కార్తిక మాసం పూర్తి చేసుకొని మార్గశిర మాసంలోకి అడుగు పెట్టిన సందర్భంగా మార్గశిర మాస విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
లక్ష్మీ నారాయణునికి ప్రీతికరం మార్గశిరం
లక్ష్మీ,నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు. మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయని చెబుతారు.
'మాసానాం మార్గశీర్షోహం'
శ్రీ కృష్ణుడు భగవద్గీతలో వివరించినట్లుగా 'మాసానాం మార్గశీర్షోహం' అంటే మార్గశిర మాసం మాసాలలోకెల్లా 'శీర్షం' అంటే' శిరసు' వంటిదని అర్ధం. ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్న మాసానికే మార్గశిరమని పేరు.
ధనుర్మాసం
ఈ నెలలోనే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ కాలమంతా ధనుర్మాసంగా భావిస్తారు. వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన సందర్భం. వైష్ణవాలయాలను దర్శించేందుకు, నారాయణుడిని అర్చించుకునేందుకు ఈ మాసం ప్రధానమైనది. వివాహం కావలసిన అమ్మాయిలు కాత్యాయనీ వ్రతం ఆచరించడం, తమలోని భక్తిభావం స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాశురాలను చదవడం ఈ మాసం ప్రత్యేకతలు.
ప్రతిరోజూ పండుగే!
కార్తిక మాసంలాగానే మార్గశిర మాసంలో కూడా ప్రతిరోజూ ఒక పండుగే. ఈ నెలలోని మొదటిరోజైన శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమిగా జరుపుకుంటాం ఈ రోజు గంగా స్నానం చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి, మిత్ర సప్తమి, ఒకవేళ ఏకాదశి తిథి వచ్చే సమయానికి ధనుర్మాసం ఆరంభమై ఉంటే, ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం. గీత జయంతి, దత్తాత్రేయ జయంతి వంటి విశేష పర్వదినాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి.
మార్గశిర లక్ష్మీ వ్రతం
కేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. గురువార లక్ష్మీవ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలనూ ఈ మాసంలో ఆచరిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఆరంభమయ్యే ధనుర్మాసం నెల రోజుల పాటు తెలుగు లోగిళ్లప రంగురంగుల రంగవల్లికలతో, గొబ్బెమ్మలతో, హరిదాసుల సంకీర్తనలతో కళకళలాడుతాయి.
తిరుప్పావై
ఇక మార్గశిర మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం నెల రోజులు తిరుమల మొదలుకొని సమస్త వైష్ణవ ఆలయాలలో తిరుప్పావై పేరుతో మొదలయ్యే వేడుకలు గోదా కల్యాణంతో ముగుస్తాయి.
కాత్యాయనీ వ్రతం
గోకులంలో గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి చేసిన వ్రతమే కాత్యాయనీ వ్రతం. మార్గశిర మాసంలో గోపికలు కాత్యాయనీ వ్రతం చేసి శ్రీకృష్ణుని భర్తగా పొందారంట. అందుకే వివాహం కానీ అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు గోదాదేవి శ్రీకృష్ణుని గురించి కీర్తించిన 30 పాశురాలను ప్రతి రోజూ చదువుకుంటే ఉత్తముడైన వ్యక్తితో శీఘ్రముగా వివాహం జరుగుతుందని విశ్వాసం.
మార్గశిర గురువారం వ్రతం
సాధారణంగా గురువారంను లక్ష్మీవారమని కూడా అంటారు. మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలో ఈ పూజను ఆచరించడం సర్వ శ్రేష్టము. ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించడం వల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం.
తలమానికం మార్గశిరం
దట్టమైన మంచు కురిసే హేమంత ఋతువులో తెల్లవారుజామున వాకిట్లో ఆవుపేడతో కళ్లాపి చల్లి అందమైన రంగవల్లికలు తీర్చడం, ఆలయాలలో తిరుప్పావై పేరుతో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పొంగలి ప్రసాదాల ఘుమఘుమలు వెరసి మార్గశిర మాసం నిజంగా మాసాలకు తలమానికమే. ఇంతటి విశిష్టమైన మార్గశిర మాసాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం వినియోగించుకుందాం. మోక్షాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.