Dasara Navaratri Rajarajeshwari Devi Avatar : ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు? ఏ శ్లోకం చదువుకోవాలి? ఏ రంగు వస్త్రాన్ని, ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేవి నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు విజయదశమి పర్వదినం నాడు శ్రీ కనకదుర్గా దేవీ సాక్షాత్తూ సిద్ధిధాత్రి శాక్తేయానుసారముగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు.
శ్రీ రాజరాజేశ్వరి దేవి విశిష్టత
సకల భువన బ్రహ్మాండాలకు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆరాధ్య దేవత. కావున మహా త్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటూ అపరాజితాదేవిగా విరాజిల్లుతుంది. ఈ రోజు అమ్మవారు బంగారం రంగు చీర ధరించి చతుర్భుజాలతో, ఒక చేతిలో చెరకుగడ, ఇంకో చేతిలో అభయముద్రలతో దురహంకారులను, శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది.
శ్లోకం
ఈ రోజు అమ్మవారిని
"అంబారౌద్రిణి భద్రకాళి బగళా
జ్వాలాముఖీవైష్ణవీ బ్రహ్మాణీత్రిపురాంతకీ
సురనుతాదేదీప్యమానోజ్జ్వలాచాముండాశ్రిత
రక్షపోషజననీ దాక్షాయణీ పల్లవి చిద్రూపి
పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ" అని స్తుతించాలి.
ఏ రంగు వస్త్రం? ఏ పూలు?
ఈ రోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. చేమంతులు, గులాబీలతో అమ్మవారిని అర్చించాలి. రాజరాజేశ్వరి దేవికి చింతపండు పులిహోర, రవ్వ కేసరి, పరమాన్నం, లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక! శ్రీమాత్రేనమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.