Dasara Navaratri First Day : శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. "ఓంకార పంజరశుకీ ముపనిషదుద్యానకేళి కళకంఠీమ్" అని బాలాత్రిపుర సుందరీదేవిని ప్రార్ధిస్తే అజ్ఞానం పటాపంచలైపోతుంది. సమస్త దేవీ మంత్రములలోకెల్లా ఈ బాలా మంత్రం మహిమాన్వితమైనది. అందుకే శ్రీ విద్యోపాసకులు మొదటగా బాలా మంత్రాన్నే ఉపదేశిస్తారు. మహా త్రిపుర సుందరి దేవీ నిత్యం కొలువుండే శ్రీచక్రం లోని మొదటి ఆమ్నాయంలో ఉండే తొలి దేవత శ్రీ బాలా దేవీ. అందుకే మొదట బాలాదేవి అనుగ్రహం పొందితే మహా త్రిపుర సుందరి దేవీ అనుగ్రహాన్ని సులభంగా పొందగలం.
కుమారీ పూజ
ఈ రోజు అమ్మవారి పేరిట భక్తులు కుమారి పూజ చేస్తారు. 8 సంవత్సరాల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీ.
ఏ రంగు వస్త్రం? ఏ పూలు?
ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి. గులాబీ పూలతో అమ్మను పూజించాలి. అలాగే కుమారి పూజలో పాల్గొనే బాలికలకు కూడా గులాబీ రంగు వస్త్రాన్ని అందించాలి. అలాగే ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా క్షీరాన్నం నివేదించాలి. ఆ బాల త్రిపుర సుందరీదేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక! ఓం శ్రీమాత్రే నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.