Balarama Jayanti Puja Vidhi In Telugu : శ్రావణ బహుళ షష్టి రోజున బలరామ జయంతిని జరుపుకుంటాం. పోతన మహాకవి రచించిన భాగవతంలో కూడా బలరామ జయంతి గురించిన ప్రస్తావన ఉంది. ఈ ఏడాది ఆగస్టు 24 వ తేదీ ఉదయం 07:52 నిమిషాలకు షష్టి తిథి మొదలై ఆగస్టు 25న 05:31 నిమిషాలకు పూర్తవుతోంది కాబట్టి ఆగస్టు 24వ తేదీనే బలరామ జయంతిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపు పూజ చేసుకోవడానికి శుభసమయం.
బలరామ జయంతి పూజ ఎలా చేయాలి?
బలరామ జయంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచియై బలరాముడు, శ్రీకృషుని చిత్రపటాలను గంధం, కుంకుమలతో అలంకరించాలి. శంఖు పూలు, పొగడ పూలు, పారిజాత పూలతో బలరామ కృష్ణులను పూజించాలి. అటుకులు, పాలు, వెన్న, మీగడ వంటి పదార్థాలతో ప్రత్యేకమైన నైవేద్యాన్ని తయారు చేసి బలరామ కృష్ణులను నైవేద్యంగా సమర్పించాలి. పూజ చేసుకునే వారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి.
దేవాలయాలలో ఇలా!
దక్షిణ భారతంలో కన్నా ఉత్తర భారతంలో బలరామ జయంతిని ఆలయాలలో ఘనంగా చేస్తారు. ఈ రోజు సాయంత్రం ఆలయాల్లో బలరాముడు, కృషుని విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అందంగా అలంకరిస్తారు. భక్తులందరూ కలిసి దేవునికి సమర్పించడానికి ప్రత్యేక భోగ్ అనగా నైవేద్యం సిద్ధం చేసి, దానిని ప్రసాదంగా అందరూ స్వీకరిస్తారు.
పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే భజనలు కీర్తనలు
పూజ పూర్తయ్యాక ఆలయంలో భక్తులందరూ కలిసి బలరామ కృష్ణులను కీర్తిస్తూ చేసే భజనలు, నృత్యాలు చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటాయి. ఈ విధంగా భజనలు కీర్తనలు పాడుతూ నృత్యాలు చేయడం వల్ల మానసిక ఆనందం, సానుకూల శక్తులు కలుగుతాయని విశ్వాసం.
దేశవ్యాప్తంగా ఇలా పూజలు
పూరీ, గంజాం జిల్లాలోని దేవాలయాల్లో బలరామ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. దేశంలోని బలియానా మందిర్, బలదేవ్‌జీవ్ మందిర్, అనంత వాసుదేవ మందిర్ వంటి ఇతర ఆలయాల్లో కూడా బలరాముని జయంతి వైభవంగా జరుగుతుంది.
ప్రకృతే బలరాముడు
బలరాముని ఆయుధాలు నాగలి, రోకలి. వ్యవసాయానికి, వడ్లు దంచడానికి ప్రతీక అయిన వీటిని ఆయుధాలుగా ధరించిన బలరాముని పూజిస్తే ప్రకృతి సహకరించి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. అంతేకాకుండా ఎవరైతే బలరామ జయంతి రోజు బలరాముని పూజిస్తారో వారు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. రానున్న బలరామ జయంతి రోజు మనం కూడా బలరామ కృష్ణులను పూజిద్దాం. ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. శుభం భూయాత్
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.