Vastu Tips for Increase House Prosperity : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే మెజార్టీ పీపుల్ ఇంటి నిర్మాణం నుంచి వస్తువుల అమరిక వరకు వాస్తు(Vastu) ను కచ్చితంగా పాటిస్తుంటారు. అలా చేయడం వల్ల భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుందని, ఇంట్లోని వారందరూ సుఖసంతోషాలతో జీవిస్తారని నమ్మకం. ఇదిలా ఉంటే, మనకు తెలియకుండా చేసే కొన్ని పనుల కారణంగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగి రకరకాల సమస్యలకు కారణమవుతోందని, ప్రతికూల శక్తి పెరుగుదల మూలంగానే ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఆ ఇంట్లో ప్రశాంతత, సుఖ సంతోషాలు, ఆనందం దూరమవుతాయంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. మరి ఈ సమస్యకు పరిష్కారంగా రోజూ ఈ ఆరు పనులు చేస్తే.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి జీవితం అష్టైశ్వర్యాలతో సాఫీగా సాగుతుందంటున్నారు. ఇంతకీ, ఆ పనులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం : ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సుఖసంతోషాలతో జీవించాలంటే చేయాల్సిన మొట్టమొదటి పని.. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇంట్లోకి చేరే మురికి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందంటున్నారు. అందుకే, ఇంట్లోకి అనవసరమైన వస్తువులను తేకుండా క్లీన్‌గా ఉంచుకునేలా చూసుకోవాలి. అలాగే రోజూ ఇంట్లో పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది అంటున్నారు.
దీపం వెలిగించడం : ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు వాస్తు పండితులు. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. అలాగే, సాయంత్రం దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుందని.. దీంతో ఆర్థిక కష్టాలు తీరిపోతాయని చాలా మంది నమ్ముతారు.
తోరణం కట్టడం : ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టి పాజిటివిటీని పెంచుకోవాలంటే మీరు చేయాల్సిన మరో పని.. ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కట్టడం అంటున్నారు పండితులు. గుమ్మానికి ఇలా కట్టడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెబుతున్నారు వాస్తు పండితులు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. తోరణానికి ఉపయోగించే ఆకులు ఆకుపచ్చగా ఉండేలా చూసుకోవాలి.
మీ ఇంట్లో తరుచూ అనారోగ్యం వేధిస్తోందా? - ఈ వాస్తు పాటించాల్సిందేనట!
ఉప్పు : మీ ఇంట్లో రోజూ బాధ కలిగించే వాతావరణం ఉంటే దాని వెనుక ప్రతికూల శక్తి ఉండవచ్చంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అలాంటి పరిస్థితులు పోయి మీరు సుఖసంతోషాలతో ఉండాలంటే ఇంట్లోని గదులను వాటర్‌తో తుడిచేటప్పుడు అందులో కాస్త ఉప్పు వేసి క్లీన్ చేసుకోవడం మంచిది అంటున్నారు వాస్తు పండితులు. అలా చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుందని చెబుతున్నారు.
సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం : మీరు డైలీ సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జాతకంలో సూర్యగ్రహం బలపడుతుందని చెబుతున్నారు వాస్తుశాస్త్ర పండితులు. దీని ఫలితంగా మీరు జీవితంలో మంచి ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు.
తులసి పూజ : మీరు సుఖసంతోషాలతో జీవించాలంటే చేయాల్సిన మరో పని.. రోజూ తులసి పూజ చేయడం. అంటే తులసికి అర్ఘ్యం సమర్పించడం, ఉదయం, సాయంత్రం తులసి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించండం వంటివి చేయాలి. ఎందుకంటే తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అదే సమయంలో, శుక్రవారం నాడు ఉపవాసం ఉండటం, లక్ష్మీ సూక్తం పారాయణం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.