Tirumula Brahmotsavalu Hanuma Vahanam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు (అక్టోబర్ 9వ తేదీ)న ఉదయం శేషాచలాధీశుడు - శ్రీరాముని అవతారంలో ధనస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అందుకే హనుమ వాహన సేవ విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
భక్తికి పరాకాష్ట
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యులు. భక్తికి పరాకాష్ట హనుమత్ తత్వం. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతునిగా, లంకాభీకరునిగా ప్రసిద్ధుడైన ఆంజనేయ స్వామి, వేంకటాద్రి వాసుని మోపున వహించి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో దర్శనమిస్తారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహనీయులు కనుక బ్రహ్మోత్సవాలలో వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.
హనుమంత వాహన దర్శనం సకలపాప హరణం
హనుమంత వాహనం అంటే భగవత్ భక్తి ప్రాప్తి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే బ్రహ్మోత్సవాలలో హనుమంతునిపై ఊరేగే శ్రీనివాసుని దర్శిస్తే భగవంతునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు పెంపొందుతాయని, జన్మాంతర పాపాలు నశిస్తాయని పురాణం వచనం.
హనుమంత వాహనంపై ఊరేగే శ్రీనివాసునికి నమస్కరిస్తూ - ఓం నమో వేంకటేశాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.