Alagar Kovil Temple History : వైష్ణవ సంప్రదాయం ప్రకారం 108దివ్య క్షేత్రాల్లో ఒకటిగా, దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన అళగర్ కోవెల తమిళనాడులోని మధురైకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన చెట్ల నడుమ, ఓ కొండ పక్కన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందులోని మూలమూర్తి పేరు తిరుమాళ్! మధుర మీనాక్షి దర్శనం కోసం వెళ్లిన వారిలో కొద్దిమంది మాత్రమే ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయం గురించి అందరికీ పెద్దగా తెలిసి ఉండకపోవడమే ఇందుకు కారణం. మధురలోని మీనాక్షి అమ్మవారికి ఈ స్వామి సోదరుడని, అందుకే మధురలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో, ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహం కూడా తరలివెళ్తుందని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
దక్షిణ తిరుపతి అన్న పేరు ఇందుకే!
ఈ ఆలయంలోని స్వామి రూపం వెంకటేశ్వర స్వామి స్వరూపానికి దగ్గరగా ఉండడం, అడుగడుగునా అలరించే ప్రకృతి కారణంగా ఈ క్షేత్రం దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. దాదాపు రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయ వర్ణన తమిళ ప్రాచీన గ్రంథం శిలప్పదికారంలో ఉంటుంది. అంతేకాదు తమిళ సాహిత్యంలో ఎక్కువగా ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంటుంది. ఆలయం చుట్టూ ఉన్న శిధిలమైన కోట గోడలు ఆనాటి రాచరికాన్ని గుర్తుచేస్తాయి. సుమారు 180 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం ఈ ఆలయపు గత వైభవాన్ని గుర్తుచేస్తాయి. ద్రావిడ దేశాన్ని పాలించిన పాలకుల్లో ఒకరైన సుందరపాండ్యన్ అనే రాజు 13వ శతాబ్దంలో స్వామి వారి విమాన గోపురం మీద పోయించిన బంగారు పోత సూర్యకాంతికి మెరుస్తూ దర్శనమిస్తుంది.
స్వామి బంగారం
అళగర్ కోవెలలో స్వామి మూల విరాట్ విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది. ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేశారు. ఆలయంలో రథ మండపం, కళ్యాణ మండపం, వసంత మండపం, అలంకార మండపం ఇలా అనేక కట్టడాలు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి.
అళగర్ కోవెల ప్రాంగణంలో ఉపాలయాలు
అళగర్ కోవెల ప్రాంగణంలో ఉన్న కరుప్పు స్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఇది చాలా శక్తిమంతమైనదని అంటారు. కరుప్పు స్వామి ఉగ్ర రూపాన్ని సామాన్యులు చూసి తట్టుకోలేరని అంటారు.
ఎవరీ కరుప్పు స్వామి!
అళగర్ స్వామి ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసింది. ఈ విగ్రహంపై కన్నేసిన 18 మంది దొంగలు ఒకసారి ఈ ఆలయం మీద దాడి చేశారట! అయితే ఇలాంటి దాడి జరగవచ్చని ముందుగానే ఊహించిన పూజారులు దొంగలపై తిరగబడి 18 మంది దొంగలను మట్టి కరిపించారంట! ఆ సమయంలో వారి ముందు కరుప్పు స్వామి అనే కావలి దేవత ప్రత్యక్షమై ఇకనుంచి ఈ ఆలయాన్ని రక్షించే భారం తనదే అని మాట ఇస్తాడు. ఆనాటి నుంచి అళగర్ స్వామికి క్షేత్ర పాలకుడిగా, రక్షకుడుగా కరుప్పు స్వామి అక్కడే వెలసి ఉన్నాడు.
ఏడాదిలో ఒక్కసారే దర్శనం
కరుప్పు స్వామి ఆలయాన్ని ఏడాదికి ఒక్కసారి మాత్రమే తీస్తారు. విచిత్రమేమిటంటే కరుప్పు స్వామి ఆలయం తలుపులు తీసి ఉన్నంత సేపు పక్షులు, క్రిమికీటకాలు సైతం నిశ్శబ్దం వహిస్తాయి. చిన్నపాటి శబ్దం కూడా లేకుండా ఆ పరిసరాలన్నీ ప్రశాంతంగా మారిపోతాయి. గాలి కూడా వీచదు. వాతావరణం కూడా వేడెక్కిపోతుంది.
సుందరవల్లి తాయార్ ఆలయం
అళగిరి కోవిల్‌లో తిరుమాళ్ స్వామివారితో పాటుగా స్వామి వారి సతీమణి సుందరవల్లి తాయార్ ఆలయం కూడా తప్పకుండా దర్శించుకోవాలి. వివాహం కాని మహిళలు ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తే త్వరలో వివాహం జరుగుతుందని అంటారు. అందుకే ఈమెకు కళ్యాణవల్లి తాయార్ అన్న పేరు కూడా ఉంది.
ఇతర దేవీ దేవతలు
ఈ ఆలయంలో నరసింహ స్వామి, చక్రత్తాళ్వార్, వినాయకుడు, ఆండాళ్ దేవతల విగ్రహాలూ కూడా భక్తులకు దర్శనమిస్తాయి.
నూపుర గంగ తీర్థం
ఆలయానికి అతి సమీపంలో నూపుర గంగ తీర్థం ఉంది. శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తినప్పుడు బ్రహ్మ ఆయన పాదాలను కడిగే సమయంలో ఆయన పాదాలపై ఉన్న నూపురాలు అంటే ఆభరణాల నుంచి జాలువారిన గంగ కాబట్టి దీనికి నూపుర గంగ తీర్థం అని పేరు వచ్చిందని అంటారు. ఈ తీర్థంలో నీరు తాగితే సర్వరోగాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.
అళగర్ స్వామి మహిమలు
అళగర్ స్వామి మహిమలు గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
- ద్రావిడ దేశాన్ని పాలించిన పాండ్యరాజుల్లో రెండోవాడైన మలయధ్వజ పాండ్యరాజుకి అళగర్ స్వామి ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
- భగవద్ రామానుజుల ముఖ్య శిష్యుడైన కరుదాళ్వార్‌కు కంటి చూపు ఉండేది కాదు. అళగర్ స్వామి మహిమతోనే కరుదాళ్వార్‌కు కంటి చూపు తిరిగి వచ్చిందని స్థానికులు చెబుతారు.
- ద్వాపర యుగంలో ధర్మరాజు, అర్జునులు సైతం ఈ స్వామిని దర్శించి సేవించారని తమిళ సాహిత్యం ద్వారా తెలుస్తోంది.
- ఇక కృష్ణదేవరాయలు మొదలుకొని విశ్వనాథ నాయకుని వరకు ఎందరో దక్షిణాది రాజులు ఈ స్వామిని దర్శించి తరించారు.
- అళగర్ స్వామిని దర్శిస్తే మనసులో కోరికలు తప్పక తీరుతాయని భక్తుల విశ్వాసం.
మధురైకి వెళ్లిన వారు తప్పకుండా అళగర్ స్వామిని దర్శించి మనోభీష్టాలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం