YS Sharmila Responds On Subba Reddy Comments : జగన్‌కు లాభం అనుకుంటే ఎవరినైనా వాడుకుంటారని, లేదని అనుకుంటే అణిచివేస్తారని వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి సుబ్బారెడ్డి అని వ్యాఖ్యానించారు. సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని, రేపు సాయిరెడ్డి కూడా సుబ్బారెడ్డి లాగే మాట్లాడతారని చెప్పారు. అందరికీ సమాన వాటా ఉండాలని వైఎస్ అనుకున్నారని తన బిడ్డలపై ప్రమాణం చేస్తానన్నారు. సుబ్బారెడ్డి చెప్పిన విషయాలన్నీ నిజమని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు.
పేరు పెట్టుకుంటే ఆస్తి చెందుతుందా : పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు ఇవ్వాలని ఉందా అని సుబ్బారెడ్డి అన్నారని, ఆస్తులు తనవైతే తాను కూడా జైలుకు వెళ్లాలని సుబ్బారెడ్డి అన్నారని గుర్తు చేశారు. వేరే వ్యక్తులు ఇలా మాట్లాడితే పట్టించుకునేదాన్ని కానని బాబాయికి అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'కంపెనీలకు భారతి, జగతి అని పేర్లు పెట్టుకున్నారంటా, అయినా వాళ్లు ఆ పేర్లు పెట్టుకున్నారంటే రాజశేఖర్ రెడ్డి అనుమతి ఇచ్చినందుకే కదా. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు వాళ్లకే చెందాలని ఏమైనా రూల్ ఉందా' అని ప్రశ్నించారు. ఆస్తులు మొత్తం జగన్ రెడ్డిపైనే ఉన్నాయని ఆయన జైలుకు వెళ్లారని సుబ్బారెడ్డి చెబుతున్నారు, కానీ భారతీ మీద కూడా ఆస్తులు ఉన్నాయి కదా ఆమె ఎందుకు జైలుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
నా ప్రేమకు షరతులు వర్తిస్తాయి - వైఎస్ షర్మిలకు జగన్ లేఖాస్త్రం
"గిఫ్ట్ ఇస్తానని ఎవరైనా ఎంవోయూ రాసుకుంటారా.. విజయమ్మను కోర్టుకు లాగారంటే దానికి కారణం ఎవరు?, సొంత కుమారుడే తల్లిని కోర్టుకు లాగడం దారుణం కాదా? తనకు లాభం ఉందని అనుకుంటే జగన్ ఎవరినైనా వాడుకుంటారు. తనకు లాభం లేదని అనుకుంటే జగన్ ఎవరినైనా అణిచివేస్తారు. జగన్ లాంటి వ్యక్తి నాయకుడో, శాడిస్టో వైసీపీ శ్రేణులు ఆలోచించాలి. ఇలాంటివి చూసేందుకేనా బతికి ఉన్నానని విజయమ్మ బాధపడుతోంది." - షర్మిల, జగన్ సోదరి
జగన్ కోసం నేను, అమ్మ చాలా కష్టపడ్డాం : ఈ గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయని సుబ్బారెడ్డి అంటున్నారని అలాగైతే కన్నతల్లిని కోర్టుకు లాగడం ఘర్ ఘర్‌కీ కహానీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. కన్నతల్లిని కోర్టుకు లాగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అన్న ప్రశ్నించిన షర్మిల, జగన్ కోసం తను, అమ్మ చాలా కష్టపడ్డామని తెలిపారు. ఆయన కోసం తాను 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు గుర్తుచేశారు. తానేం తప్పు చేశారో వైసీపీ నేతలు, కార్యకర్తలు చెప్పాలని డిమాండ్ చేశారు.
'జగన్ కోసం రెండు ఎన్నికల్లో పాదయాత్ర చేశా. ఆయన బాగు కోసం నేను ఎన్నో పనులు చేశా.. నా మేలు కోసం ఆయన ఏమైనా చేశారా? చెల్లి కోసం ఇది చేశానని జగన్ చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ఐదేళ్ల పాటు ఎంవోయూ పత్రాలు నా వద్దే ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఎంవోయూ నేను వాడుకోలేదు. వైఎస్ కుటుంబం గురించి చెడ్డగా చెప్పుకుంటారనే ఎంవోయూపై మాట్లాడలేదు'-షర్మిల, జగన్ సోదరి