AP PCC chief YS Sharmila Arrested : ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొండవీటి ఎత్తిపోతల వద్ద వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. షర్మిల అరెస్టు సమయంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకుల అరెస్టు అయ్యారు. మెగా డీఎస్సీ కావాలంటూ చలో సచివాలయానికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రరత్న భవన్ నుంచి చలో సచివాలయానికి వెళ్తుండగా షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు, మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇది భారతదేశమేనా లేదా అఫ్గనిస్తానా?: రాష్ట్రంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగమని, 2.3 లక్షల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్, దగా డీఎస్సీ ఇచ్చారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన (Congress Chalo Secretariat) చేయాలనుకుంటే ఎందుకు నియంత్రించారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఇది భారతదేశమేనా లేదా అఫ్గనిస్తానా అని నిలదీశారు. కర్ఫ్యూ వాతావరణం సృష్టించి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు రెండు రోజుల నుంచి తమ కార్యకర్తలను నియంత్రించారని, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులు ఏం రాసుకుంటే మీకెందుకు?: ఏ పార్టీ అయినా, జర్నలిస్టులు అయినా ఏం రాసుకుంటే మీకెందుకు అని షర్మిల మండిపడ్డారు. మమ్మల్ని నియంత్రిస్తున్నారంటే మీరు భయపడుతున్నట్లే కదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై ఆంక్షలు పెడుతున్నారు, జర్నలిస్టులను చితకబాదుతున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు జగన్ ఏం చెప్పారని, ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు నోటిఫికేషన్ల వరద పారిస్తానన్న జగన్, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. ఏపీపీఎస్సీ ద్వారా అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ చెప్పలేదా అని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను వైసీపీ బంటుల్లా వాడుకుంటారా అని ప్రశ్నించారు. మీరేమైనా తాలిబన్లా, ఏపీలో ప్రజాస్వామ్యం లేదా అని నిలదీశారు.
కాంగ్రెస్ 'చలో సెక్రటేరియట్' - ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల నిర్బంధం - ఉద్రిక్తత
"నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆందోళన చేస్తే మీకెందుకు భయం ? మేం ప్రజలకు దగ్గరవుతామని మీకు భయమా ? ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకివ్వలేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉపాధి లేక 21 వేలమంది ఆత్మహత్య చేసుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇలా అయితే యువతే లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవదా ? మెగా డీఎస్సీ కాకుండా దగా డీఎస్సీ ఇచ్చారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు వారి కార్యకర్తలకు ఇచ్చినవే". -వైఎస్ షర్మిల, ఏపీసీసీ అధ్యక్షురాలు
అరెస్ట్‌పై ఆగ్రహం: పోలీసులు నిర్బంధించడంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్యం చేశారు. రాత్రి నుంచి పోలీసు దమనకాండ కొనసాగుతోందని, అక్రమంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారని, జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
జగన్ ఇచ్చిన హామీలే అమలు చేయలేదు, వైఎస్ఆర్ అశయాలు ఎలా నిలబెడతారు: షర్మిల