YS Jagan And Raghu Rama Conversation: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మధ్య సంభాషణ జరిగింది. అసెంబ్లీ హాల్లో జగన్ తన భుజంపై 2 సార్లు చేయి వేసి మాట్లాడారని ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అన్నారు. కనిపించిన వెంటనే హాయ్ అని జగన్ పలకరించారని తెలిపారు.
రోజూ అసెంబ్లీకి రావాలని ఆయన్ని కోరానని రఘురామ తెలిపారు. రెగ్యులర్‌గా వస్తాను, మీరే చూస్తారుగా అని జగన్ చెప్పారని అన్నారు. తనకు జగన్ ప్రక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్‌ను రఘురామ కృష్ణ రాజు కోరారు. తప్పని సరిగా అంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్ లాబీలోకి నవ్వుకుంటూ వెళ్లారు. ఈ మేరకు జగన్‌తో జరిగిన సంభాషణ వివరాలను రఘురామ కృష్ణంరాజు మీడియాతో పంచుకున్నారు.
కాగా తనను హత్య చేయించబోయారంటూ ఇటీవలే జగన్‌పై రఘురామ కృష్ణరాజు కేసు పెట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా గతంలో వైఎస్సార్సీపీ ఎంపీగా ఉంటూనే రఘురామ అప్పటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, జగన్ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. ఈ క్రమంలో రఘురామకృష్ణ అరెస్ట్ తదితర పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత కూడా రఘురామ వెనక్కి తగ్గలేదు.