WHY BJP Fails To Reach Double-Digit Seats IN TG : పార్లమెంట్ నియోజకవర్గాల్లో డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ ప్రచారం హోరెత్తించింది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతానికే పరిమితమైన బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల ఓటు బ్యాంకు కొల్లగొట్టి 8 స్థానాల్లో గెలుపొందింది. ఉమ్మడి ఏపీ చరిత్రలో చూసినా కాషాయపార్టీ 8 సీట్లు కైవసం చేసుకోవడం ఇదే ప్రప్రథమం.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే గెలుపొందిన భారతీయ జనతా పార్టీ 5 నెలల తర్వాత జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు 19.65% ఓటుబ్యాంకు సొంతం చేసుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు, 13.90% ఓటుబ్యాంకు సాధించింది. 6 నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాలు, 35% ఓటుబ్యాంకు కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నిక ల్లో 22% ఎక్కువ ఓటుబ్యాంకును బీజేపీ పెంచుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు సాధించి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనాతా పార్టీ ఎదిగింది.
సిట్టింగ్ స్థానాలైన అదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో తిరిగి గెలుపొందింది బీజేపీ. ఆదిలాబాద్‌లో అభ్యర్థిని మార్చినా ఆ నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీకే పట్టం కట్టారు. సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 4 స్థానాలైన మల్కాజిగిరి, మెదక్, మహబూబ్‌నగర్, చేవెళ్ల స్థానాల్లోనూ విజయదుందుబి మోగించింది. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్, సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి, కరీంనగర్‌లో బండి సంజయ్, నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్, చేవెళ్లలో కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, మెదక్‌లో రఘునందన్‌రావు, ఆదిలాబాద్‌లో గోడెం నగేష్ గెలుపొందారు.
హైదరాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. 8 స్థానాల్లో గెలిచినా డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకోకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. జహీరాబాద్, నాగర్‌కర్నూల్, భువనగిరి, పెద్దపల్లిలోనూ విజయం సాధిస్తామని భావించినప్పటికీ ప్రతికూల ఫలితాలు రావడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు.
ఈ 4 చోట్ల రెండో స్థానంలో నిలిచిన బీజేపీ విజయం కోసం మరింత కష్టపడాల్సి ఉండేదని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. వీటితో పాటు జహీరాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ అభ్యర్థులను ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పార్టీలో చేర్చుకుని టికెట్ కట్టబెట్టడంతో బీజేపీ శ్రేణుల నుంచి పూర్తిగా సహకారం అందించలేదనే ప్రచారం నడుస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. బీజేపీకు బలమైన అభ్యర్థులులేని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లోని జన, ధనబలం ఉన్న నేతలను పార్టీలో చేర్చుకొని బరిలోకి దింపింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం హోరెత్తించింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ.నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నాయకులు సభలు, సమావేశాలకు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీల అమల్లో వైఫల్యాలని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ పాలన, సంక్షేమ పథకాలు, నిర్ణయాలు, తెలంగాణకు కేంద్రం చేసిన సాయాన్ని అంకెలతో వివరించారు. కార్యకర్తలు కూడా ఇంటింటికీ తిరుగుతూ మోదీ గ్యారంటీ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య రామ మందిరం నిర్మాణం, ఇంటింటికీ అయోధ్య అక్షింతల పంపిణీ, కరోనా వ్యాక్సిన్, ఉచిత బియ్యం, కిసాన్ సమ్మాన్, అయిష్మాన్ భారత్, ఉజ్వల యోజన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కమలదండు విజయవంతమైంది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో క్రమంగా ఓటింగ్ శాతం పెంచుకుంటున్న బీజేపీ భవిష్యత్‌లో అధికారంలోకి రావాలని ఆశిస్తుంది. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని పార్టీ అధినాయకత్యం భావిస్తోంది. బూత్‌స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలోపేతంపై దృష్టి పెట్టాలని చూస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్‌కు పదునుపెట్టి ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ధన, జన బలం ఉన్న నేతలను పార్టీలో చేర్చుకొని 2028అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలనే యోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. పాత, కొత్త కలయికతో మండల, జిల్లా కమిటీలు వేయాలని భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవిని తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యక్తికి కట్టబెట్టాలనుకుంటోంది. అన్నివర్గాలను ఆకట్టుకునేలా సామాజిక సమీకరణాలు పాటించేందుకు ప్రణాళిక రచిస్తోంది.
త్వరలో కొలువుతీరే కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఒక కేబినెట్, మరొక్క సహాయ మంత్రి వస్తాయని సమాచారం. అధ్యక్ష పదవి రెడ్డికి ఇస్తే, బీసీలకు కేబినెట్ బెర్త్ ఇచ్చి. సహాయ మంత్రి పదవిని ఎస్టీకి కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఫలితంగా అన్నివర్గాల మద్దతును చొరగొని వచ్చే శాసనసభ ఎన్నికలో అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగి అధికారం చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వెళ్లాలని బీజేపీ భావిస్తోంది.
ఆరు నెలల్లోనే బ్యాక్ టు ఫామ్ - పడిలేచిన కెరటంలా రాణించిన బీజేపీ - BJP WINS CHEVELLA LOK SABHA 2024