Which Party will MIM Support in Telangana : పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎవరికి వారు తమ తమ వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా 14 స్థానాల్లో జెండాఎగరేయాలని హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతుండగా, మోదీ గ్యారంటీ పేరుతో డబుల్ డిజిట్ సాధించేందుకు కమలం కష్టపడుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో కాస్త డీలా పడ్డ బీఆర్ఎస్, లోక్‌సభ పోరులోనైనా తమ సత్తా చాటి తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తోంది.
Parliament Elections 2024 : ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో కింగ్ మేకర్‌గా విరాజిల్లుతోన్న ఎంఐఎం పార్టీ, ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు కట్టబోతుందన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మజ్లిస్ పార్టీ ఎవరికి మద్దతు ప్రకటిస్తుందో, రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్లు వారికే దక్కే అవకాశం ఉందని కొందరు నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉన్న ఎంఐఎం, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో హస్తం పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. వారం, పది రోజుల్లో అసదుద్దీన్ దీనిపై క్లారిటీ ఇస్తారని సమాచారం.
మజ్లిస్, కాంగ్రెస్ మధ్య సయోధ్య - చేతిలోన చెయ్యేసి సర్కార్‌కు ఒవైసీ భరోసా!
గతంలోనూ ఇలాగే : అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తే, తాము గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం ఉండదనే ఉద్దేశంతో ఎంఐఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. గతంలోనూ మజ్లిస్ పార్టీ ఇలాగే వ్యవహరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ఆ పార్టీకి మద్దతుగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్తో దోస్తీ కొనసాగించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 'కారు'తో కలిసి బరిలోకి దిగిన 'పతంగి', కేవలం 11 చోట్ల మాత్రమే పోటీ చేసింది. మిగతా చోట్ల భారత రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటించింది.
హస్తం పార్టీతో అత్యంత చనువుగా : ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో, ఎంఐఎం ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. మొదట్లో 'చేతి'కి వ్యతిరేకంగా ఉన్న ఒవైసీ సోదరులు, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆ సర్కార్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. లండన్ పర్యటన సమయంలో అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి వెంట కనిపించడం, పాతబస్తీ మెట్రో పనులకు శంకుస్థాపన సమయంలో అసదుద్దీన్ ఒవైసీకి రేవంత్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఇందులో భాగమే అని తెలుస్తోంది.
ఆచితూచి అడుగులు వేస్తున్న మజ్లిస్ పార్టీ - కంచుకోట పాతబస్తీపై పట్టు కొనసాగించేనా?
పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని రెండు పార్టీల మధ్య దిల్లీ స్థాయిలో అనధికార చర్చలు జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు లోక్‌సభ పోరులో మజ్లిస్ పార్టీ తమకు తోడ్పాటు అందించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నాయి. హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఎంపీగా పోటీ చేస్తుండగా, మిగిలిన చోట్ల హస్తం పార్టీకి మద్దతు ఇచ్చే అవకాసం ఉందని సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
అసెంబ్లీలో అక్బరుద్దీన్ వర్సెస్ మంత్రులు - విద్యుత్ హామీలపై క్లారిటీ ఇవ్వాలన్న ఓవైసీ