Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా హామీలు, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతు తమ గుర్తును గుర్తుంచుకోమంటున్నారు. ఆరు గ్యారంటీలు అమలవ్వాలంటే 14 ఎంపీ సీట్లు ఇవ్వాలని హస్తం నేతలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేందుకు బీఆర్ఎస్కు మద్దతివ్వాలంటూ గులాబీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. సుస్థిర పాలనతో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు, మరోసారి అవకాశమివ్వాలంటూ కమలనాథులు ఇంటింటికి తిరుగుతున్నారు.
Election Campaign in Telangana 2024 : రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్న కాంగ్రెస్ నేతలు, కేంద్రంలోనూ మద్దతిస్తే ప్రత్యేక నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ పరిధిలోని మార్నింగ్ వాకర్స్‌తో కలిసి చిట్‌చాట్ నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణకు మంచిర్యాలలో, నేతకాని సంఘం నేతలు మద్దతు ప్రకటించారు.
సుల్తానాబాద్ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు వంశీకృష్ణ తరపున ఇంటింటికి వెళ్లి ఓట్లడిగారు. పదేళ్ల ప్రజావ్యతిరేక బీజేపీ పాలనను గద్దే దించేందుకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసరావు కోరారు. కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా చందుర్తి మండలంలో ప్రచారం నిర్వహించారు. వరంగల్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఓట్ల అడిగారు. ఖమ్మం అభ్యర్థి రఘురాం రెడ్డి, కూరగాయల మార్కెట్లోని దుకాణాల వద్దకు వెళ్లి చేతి గుర్తుకు ఓటేయాలని కోరారు.
మీరు ఓటేయాలనుకుంటున్న అభ్యర్థి ఏం చదువుకున్నారో తెలుసా? - MP CANDIDATES EDU QUALIFICATION
Election Campaign in Telangana : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలువురు బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆరు గ్యారంటీల అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానన్న బండి సంజయ్ సవాల్‌పై మండిపడిన పొన్నం, పదేళ్లో కేంద్రంలో బీజేపీ సర్కార్ ఎన్ని అమలు చేసిందో చెప్పాలని ధ్వజమెత్తారు. అవినీతి ఆరోపణల వల్లే సంజయ్ అధ్యక్ష పదవి తొలగించారని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఆరు గ్యారంటీల నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకే, రిజర్వేషన్లపై కాంగ్రెస్ విషప్రచారం చేస్తోందని బీజేపీ నేతలు విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ బైక్ ర్యాలీ, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా గోషామహల్‌లో మాజీ కేంద్ర మంత్రి శ్రీరాజ వర్ధన్ సింగ్ రాథోడ్ ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బండి సంజయ్, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు.
BRS Leaders Election Campaign : రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ముగిసిందన్నారు. ఏడాది దోపిడీ ఆపేస్తే రూ.40 వేల కోట్లు వసూలవుతాయని ముఖ్యమంత్రి చెప్పడం, ఆయన అవినీతికి నిదర్శనమని నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఇంటింటికి బీజేపీ పేరుతో ఓట్లభ్యర్థించిన అర్వింద్, బ్రిటీష్ పాలకుల కంటే ఎక్కువగా కాంగ్రెస్ దేశాన్ని దోచుకుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుందని రాష్ట్ర న్యాయవాదుల ఐకాస ఆరోపించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో తెలిపింది.