Bandi Sanjay Comments On Rythu Runa Mafi : కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెబుతున్న రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయడమే కాకుండా రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బండి సంజయ్ సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టారు. ఈ సందర్బంగా బండి సంజయ్ అన్నా చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.
రుణమాఫీ పేరుతో ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే రైతులు ఎంతమంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు, రుణమాఫీ ఎంతమందికి వర్తించిందో అన్ని లెక్కలు క్రోడీకరించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చనిపోయిన రైతులకు సైతం రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.
Cabinet Minister Bandi Sanjay On Congress Party : కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దాల మేడల్లో కూర్చొని, అందరికీ రుణాలు మాఫీ చేశామని ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఘాటుగా విమర్శించారు. సోనియాగాంధీ పుట్టిన రోజునాటికి అన్ని మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు మొక్కుబడిగా చేయడమంటే సోనియాగాంధీని మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తే అన్నదాతలు ఎందుకు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారో రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
"కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దాల మేడల్లో కూర్చొని నూటికి నూరుశాతం అందరికి రుణాలు మాఫీ చేశామని అనుకుంటున్నారు. కానీ బ్యాంకు అధికారుల లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. రాష్ట్ర సర్కార్ రుణమాఫీ ఎంతమంది రైతులకు వర్తించిందో అన్ని లెక్కలు క్రోడీకరించి శ్వేతపత్రం విడుదల చేయాలి. అలానే రైతులకు ఎన్వోసీ ఇప్పించండి."- బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో విలీనమైతే! : బీజేపీలో బీఆర్ఎస్ విలీనమన్న అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, రుణమాఫీ జరిగిందా? లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిందా? లేదా? చూసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో విలీనమైతే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది సీఎం కావాలని ఆశావహులు ఉన్నారని, ఎవరికి వారు తమ బలాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారేమోనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు.