Lok Sabha Election Nominations in Telangana : రాష్ట్రంలో 17 స్థానాలకు లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమై 25వ తేదీతో పూర్తి అయింది. అభ్యర్థులు వేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిశీలన కూడా నేటి నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఉపసంహరణకు సోమవారం చివరి రోజుగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 895 మంది నామినేషన్లను దాఖలు చేశారు. వీరంతా 1,488 సెట్ల నామినేషన్లు వేశారు. అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో 114 మంది నామినేషన్లు వేయగా, ఆదిలాబాద్‌లో అతి తక్కువగా 23 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.
ఇందులో చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63, భువనగిరిలో 61, వరంగల్‌లో 58, సికింద్రాబాద్‌లో 57, మెదక్‌లో 54, కరీంనగర్లో 53, ఖమ్మంలో 45, నిజామాబాద్‌లో 42, మహబూబ్‌నగర్‌లో 42, జహీరాబాద్‌లో 40, నాగర్ కర్నూల్ 34, మహబూబాబాద్‌లో 30 మంది నామినేషన్లను వేశారు. అలాగే మరోవైపు అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 24 మంది 50 నామపత్రాలు సమర్పించారు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు - ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే
అయితే ఈ నెల 18 నుంచి ప్రారంభిమైన ఎన్నికల నామినేషన్లు పర్వంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ర్యాలీలను నిర్వహించారు. ఎన్నికల నామినేషన్లను కూడా కోలాహలంతో ముందుకుపోనిచ్చారు. ఇక ఎన్నికల ప్రచార సమరమే ముందు ఉన్న విషయం. శుక్రవారం(నేడు) నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల సంఘం అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఈరోజే ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు, అన్ రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించనున్నారు.
చివరి రోజు నామినేషన్ల పర్వం : ఈనెల 25వ తేదీనే నామినేషన్లకు చివరి రోజు కావటంతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎన్నికల అధికారుల కార్యాలయాలకు తరలి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల లోపు కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి వారి నుంచి నామినేషన్లు స్వీకరించారు. అయితే వారితో ఎన్నికల అధికారులు ప్రమాణం చేయించడంతో ఈ ప్రక్రియ ఉదయం వరకు కొనసాగింది. ఫైనల్‌గా 895 నామినేషన్లు వేశారు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిలో అర్హులు ఎంతమందో గుర్తించి ఈ నెల 29న తుది ఓటర్ల జాబితాను రూపొందించి అభ్యర్థులకు అందిస్తారు.
అట్టహాసంగా చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు - భారీ ర్యాలీలు, రోడ్‌షోలతో అభ్యర్థుల దాఖలు