Telugu States Chief Ministers Meeting Today : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఆసక్తికరంగా మారింది. దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భేటీలో చర్చ జరగనుంది. కాగా ఈ భేటీపై తెలంగాణ ప్రతిపక్షాలు పలు సూచనలు చేశాయి.
షీలా బేడీ కమిటీ సిఫార్సులు, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఏపీ ఫైనాన్సియల్ కార్పొరేషన్ అంశాలపై చర్చించనున్నారు. విద్యుత్ బకాయిలు 7,200 కోట్లతోపాటు పురపాలకశాఖకు సంబంధించి 5 వేల కోట్ల బకాయిలు తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. వీటిపైనా చర్చ జరిగే అవకాశముంది. ఉద్యోగుల పరస్పర మార్పిడి పైనా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఏజెండాపై ఏపీ మంత్రుల మంతనాలు - AP Ministers on CMs Meeting
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 9,10 షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై ఇంకా పీటముడి వీడలేదు. ఈ సంస్థలకు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో దాదాపు 8వేల కోట్ల రూపాయల నగదు అలాగే ఉంది. సంస్థల విభజన పూర్తికాకపోవడంతో పదేళ్లుగా ఈ సొమ్ము ఇరు రాష్ట్రాలు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇరురాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉన్న నేపథ్యంలో, వీలైనంత త్వరగా ఈ ఆస్తులు విభజించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 9వ షెడ్యూల్‌లో 91 సంస్థలు, 10వ షెడ్యూల్‌లో 142 సంస్థలకు ఆస్తుల విభజన జరగాల్సి ఉంది.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జాబితాలో పేర్కొన్న సంస్థలు, విశ్వవిద్యాలయాలపై స్పష్టత లేదు. నిధులు ఎక్కువగా ఉన్న పెద్ద సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనకు సంబంధించి కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. 9వ షెడ్యూల్‌లో ఉన్న ఏపీ జెన్‌కో విలువ 2,448 కోట్లు ఉండగా, 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల్లో 2,994 కోట్ల నిధులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే 1,559 కోట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకున్నాయి. 1,435 కోట్ల రూపాయల విషయంలో ఇంకా పంచాయితీ తేలలేదు.
అలాగే లేబర్ సెస్ పంపకాలపై కూడా ఇరువురు నేతలు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించే అంశం కూడా ఏపీ ప్రతిపాదించనుంది. అదే విధంగా విభజన చట్టంలో లేని సంస్థల ఆస్తుల పంపకాలపైనా చర్చించనున్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశం, హైదరాబాద్‌లో ఉన్న 3 భవనాలను ఏపీకి కేటాయించే అంశంపైనా సీఎంలు మధ్య చర్చ జరగనుంది.
ఏపీఎస్‌ఆర్టీసీ కష్టాలు తీరేనా - ఉమ్మడి ఆస్తుల్లో వాటా దక్కేనా - APSRTC Losses State Bifurcation