Telangana Political Parties Speed Up In Election Campaign : రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. పార్టీల మేనిఫెస్టోతో పాటు ఎన్నికల్లో గెలిస్తే చేసే అభివృద్ధిని వివరిస్తూ నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్‌లో ఆరోపించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా తాండూరులో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌కు మద్దతుగా సిద్దిపేట, చిగురుమామిడి, సైదాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్దాలకోరని ఆయన మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహింంచారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ స్థానికుడైన తనను ఎంపీగా గెలిపించాలని కోరారు.
"నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గమంతటా ఓటింగ్ శాతం పెరగాలి. ప్రజలు ప్రతి ఒక్కరు నిత్యావసర వస్తువులు, ఆరోగ్య బీమా కల్పిస్తుంది ఎవరో ఆలోచించాలి. దేశవ్యాప్తంగా లక్షల ఇళ్లు నిర్మిస్తుంది ఎవరని ఆలోచించాలి. కానీ ఒక వర్గం మాత్రం ఇవన్నీ ఆలోచించకుండా ఓట్లు వేస్తున్నారు. మనం అందరం కలిసి ఓటింగ్ పెంచే దిశగా అడుగులు వేయాలని నేను కోరుతున్నాను." - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించే నాయకుడ్ని ఎన్నుకోవాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీను ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఏకమయ్యాయని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీల నుంచి ప్రజలను తప్పుదోవపట్టించేందుకు నేతలు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూరనర్సయ్యగౌడ్ మోత్కూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ మైదానంలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ పాల్గొన్నారు. మైదానంలో సాగుతున్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన సరదాగా బాణాలు సంధించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెరగడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదేళ్ల మోదీ ప్రభుత్వం వల్ల దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయిందని అధికారాన్ని మారిస్తే తప్ప దేశం అభివృద్ధి చెందే అవకాశం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పెద్దపల్లిలో ఆరోపించారు. గడ్డం వంశీకృష్ణకు తాము మద్దతు తెలుపుతున్నామని కార్యకర్తలు అండగా నిలబడి గెలిపించాలని కోరారు.