Telangana Lok Sabha Election Polling Today 2024 : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మాక్ పోలింగ్ కొనసాగుతోంది. ఈవీఎంల మొరాయింపు వంటి సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సరిచేసేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ముగ్గురు ఈసీఐఎల్ ఇంజినీర్లను నియమించారు. నమూనా పోలింగ్ ముగిసిన తర్వాత, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. తీవ్రవాద ప్రాబల్యమున్న 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుండగా, మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
బరిలో 50 మంది మహిళలు : రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా, వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 45 మంది పోటీలో ఉన్నారు. అతి తక్కువగా ఆదిలాబాద్‌లో 12 మంది బరిలో నిలిచారు. అభ్యర్థుల భవితవ్యాన్ని 3,32,32,318 మంది ఓటర్లు తేల్చనున్నారు. తెలంగాణలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
రాష్ట్రంలో ఓటర్ల వివరాలు :
- మహిళలు - 1,67,01,192
- పురుషులు - 1,65,28,366
- ట్రాన్స్ జెండర్ - 2,760
- వృద్ధులు - 1,93,754
- దివ్యాంగులు - 5,27,486
- 18- 19 ఏళ్లు వారు - 9,20,313
ఓటేద్దాం ఛాలెంజ్ చేద్దాం - గత రికార్డులు తిరగరాద్దాం - TS LOK SABHA ELECTION POLLING 2024
రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు : ఓటింగ్ ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 2,94,000 మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. 61 పోలింగ్ కేంద్రాల్లో పది మందిలోపే ఓటర్లు ఉన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద మంచి నీరు, వైద్య సదుపాయాలతో పాటు కుర్చీలు, ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
82 శాతం హోమ్ ఓటింగ్ : రాష్ట్రవ్యాప్తంగా 105019 ఈవీఎం యూనిట్లను వినియోగించనున్నారు. కంట్రోల్ యూనిట్లు 44,569, వీవీ ప్యాట్ యూనిట్లు 48,134 సిద్ధం చేశారు. ఒక ఈవీఎంలో 15 మంది అభ్యర్థులు, నోటా బటన్ ఉంటాయి. దాని ప్రకారం ఏడు నియోజకవర్గాల్లో 3 బ్యాలెట్ యూనిట్లు, తొమ్మిది నియోజకవర్గాల్లో రెండు యూనిట్లు, ఆదిలాబాద్ ఒకే యూనిట్‌తో పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో 3,32,00,000 ఓటర్లు ఉండగా, 96 శాతం మందికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21,690 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది ఓటింగ్ 82 శాతం నమోదైంది. 1,88,000 మంది ఓటు వేయగా, మరో 34,973 మంది పోలింగ్ రోజునే ఓటు వేసేందుకు అనుమతి పొందారు.
ఓటింగ్ ముగిసేవరకు 144 సెక్షన్ : అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారని అధికారులు తెలిపారు. రాష్ట్రానికి చెందిన పోలీసులు, ఇతర యునిఫాం సిబ్బంది సుమారు 65,000 మందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 20,000 మందితో బందోబస్తు ప్రణాళికలు చేశారు. కేంద్రం నుంచి 165 కంపెనీల సాయుధ బలగాలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసే వరకు తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉండనుంది. జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని సీఈవో స్పష్టం చేశారు. డబ్బు, మద్యం పంపిణీ వంటి ప్రలోభాలపై గట్టి నిఘా పెట్టినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా ఇవాళే ఎన్నికలు జరగనున్నాయి.