Telangana Lok Sabha Election Schedule 2024 : సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల లాస్య నందిత మృతితో ఖాళీ అయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానానికి మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు 18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలనూ సీఈసీ వెల్లడించారు. ఏపీలోనూ మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
అంతకుముందు ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా మాట్లాడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్, దేశ పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ సంవత్సరాన్ని ఎలక్షన్స్ ఇయర్‌గా చెప్పుకోవచ్చని అభివర్ణించారు. ఈ క్రమంలోనే ప్రపంచమంతా భారత ఎన్నికల వైపు చూస్తోందని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలను ప్రపంచం గమనిస్తోందన్నారు. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం నెలకొన్న భారతదేశం, ఎలా ఓటు చేస్తుందన్నది ప్రపంచం గమనిస్తోందని తెలిపారు.
యువత చైతన్యవంతమై ఓటింగ్ శాతం పెంచేందుకు కృషిచేయాలి : ఈసీ
ఈ సందర్భంగా ప్రతి ఎన్నిక ఎన్నికల సంఘానికి ఒక పరీక్షే అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి పరీక్షలోనూ విజయం సాధించాలనేదే ఈసీ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశమంతా పర్యటించి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించామన్న ఆయన, ప్రతి అంచెలోనూ తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఈ క్రమంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో ఎన్నికలకు సౌకర్యాల కల్పన పెద్ద సవాల్ అన్న ఆయన, దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ ఎన్నికల్లో 55 లక్షల ఈవీఎంలు వినియోగించనున్నట్లు తెలిపారు. 1.25 కోట్ల మంది సిబ్బందితో ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల బడ్జెట్ ఎంతో తెలుసా? ఎలక్షన్లకు అయ్యే ఖర్చు తెలిస్తే షాక్!
'దేశంలో మొత్తం ఓటర్లు 96.8 కోట్లు. పురుష ఓటర్లు 49.7 కోట్లు. మహిళా ఓటర్లు 47.1 కోట్లు. తొలిసారి ఓటు వేయనున్న యువత 1.85 కోట్లు. 48 వేల మంది ట్రాన్స్‌జెండర్లు, 88.4 లక్షల మంది దివ్యాంగులు. 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు కేవైసీ యాప్‌లో చూడవచ్చు. అభ్యర్థి పూర్తి వివరాలను ప్రతి ఓటరూ తెలుసుకోవచ్చు. అభ్యర్థిపై ఉన్న క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలు యాప్‌లో ఉంటాయి. తాయిలాలు, నగదు పంపిణీ జరిగితే ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయండి. మీ సెల్‌ఫోన్ లొకేషన్‌ను బట్టి మీ ప్రాంతానికి 100 నిమిషాల్లో చేరుకుంటాం.' అని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
ఎన్నికల కోడ్ కథ తెలుసా? ఎప్పుడు ప్రవేశపెట్టారు? అమల్లోకి వచ్చాక ఏం జరుగుతుంది?