TDP Leader Somireddy Comments on CS Jawahar Reddy : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా జవహర్‌రెడ్డి మాదిరిగా దిగజారలేదని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు, చీప్ సెక్రటరీ అంటూ ఘాటుగా వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. జగన్‌కు గులాంగా మారి వారి దోపిడీకి జీ హుజూర్ అంటూ దారుణంగా వ్యవహరించారన్నారు. చట్టాలను బూటు కాళ్ల కింద నలిపేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ కన్నా నిజాయతీగా పని చేసే పంచాయతీ సెక్రటరీలే మేలనే పరిస్థితి తెచ్చారని ఆరోపించారు.
వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, శానససభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేసేశారని మండిపడ్డారు. ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తానంటున్నారే ఏ రోజైనా సీఎస్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారా అని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూకుంభకోణాలకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. ప్రజల పాలిట పెనుశాపమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఒక సీఎస్‌గా ఎలా అంగీకరిస్తారని, ఎవరూ అడగని రీసర్వేను రైతులపై బలవంతంగా ఎలా రుద్దుతారని ప్రశ్నించారు.
తాతలు, తండ్రులు ఇచ్చిన పొలాల్లో వైఎస్‌ఆర్ జగనన్న భూరక్ష పేరుతో రాళ్లు ఎలా నాటుతారన్న ఆయన ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల పత్రాలపై రోజూ జగన్ ఫొటోలు చూసుకోవాలా అని విమర్శించారు. సీఎస్ భూకుంభకోణం చేసిందీ, లేనిదీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తేలుస్తుందని హెచ్చరించారు. రాజకీయ హింస జరుగుతుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదుపు చేయడంలో విఫలమైన సీఎస్‌కు కన్ఫర్డ్ ఐఏఎస్‌ల ఫైలుపై అంత ఆత్రం ఎందుకని ఆక్షేపించారు.
మమ్మల్ని తరిమేయడం కాదు - మీ సంగతి చూసుకోండి: సోమిరెడ్డి - tdp leader on ysrcp leaders attacks
"దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ సీఎస్ కూడా ఇలా దిగజారలేదు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు, చీప్ సెక్రటరీ. ఆయన హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు శానససభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారు. వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్అండ్‌బీ, విద్య తదితర కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించే అధికారం మీకెవరిచ్చారు?. సీఎం జగన్‌కు సీఎస్ జవహర్ రెడ్డి గులాంగా మారి చట్టాలను బూటు కాళ్ల కింద నలిపేయడం దుర్మార్గం. జగన్ దోచుకుంటున్న రూ.లక్షల కోట్లకు కౌంటింగ్ ఏజెంట్‌గా ఆయన మారిపోవడం దురదృష్టకరం. భూకుంభకోణం చేసిందీ, లేనిదీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తేలుస్తుంది." - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం నేత