TDP Ganta Srinivasa Rao Filed Petition in High Court: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు కీలకపాత్ర పోషిస్తుందని తెలిసి 2021లో ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ప్రస్తుతం ఆమోదించారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీనివెనుక దురుద్దేశం ఉందని పేర్కొంటూ గంటా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విశాఖ ఉత్తర శాసనసభ నియోజకవర్గానికి తన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ఈ ఏడాది జనవరి 23న ఇచ్చిన ఉత్తర్వులు, దానిని అనుసరించి న్యాయ, శాననవ్యవహారాలశాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన గెజిట్ ప్రకటనను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. వాటిని రద్దు చేయాలని అభ్యర్థించారు. సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్నారు. తాను ఏపీ శాసనసభ బడ్జెట్ సెషన్‌లో పాల్గొనడంతోపాటు రాజ్యసభ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు.
టీడీపీ తరఫున 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాను. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పిటిషన్లో తెలిపారు. ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ నిర్ణయంపై నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నానని, నిరసనలో భాగంగా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుని 2021 ఫిబ్రవరి 12న స్పీకర్‌కు లేఖ పంపానన్నారు. దానిని తాను వ్యక్తిగతంగా స్పీకర్‌కు అందజేయలేదని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బతోనే నా రాజీనామా ఆమోదం: గంటా శ్రీనివాసరావు
లేఖపై తర్వాత చర్యలు లేవని, ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఉన్నానని అన్నారు. ఫిబ్రవరి 2023లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు శాసనసభ సమావేశాలకు హాజరు అవుతూనే ఉన్నానని తెలిపారు. స్పీకర్ తన రాజీనామాను ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఆమోదించడం ఆశ్ఛర్యానికి గురిచేసిందన్నారు.
తనను పిలిచి వివరణ కోరలేదని, ఏపీ శాసనసభ బిజినెస్ రూల్ 186 ప్రకారం ఏవిధమైన విచారణ జరపకుండా రాజీనామా ఆమోద నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నిర్ణయం దురుద్దేశంతో తీసుకుందని తెలిపారు. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని, ఈ ఏడాది మార్చిలో నిర్వహించబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో తన రాజీనామాను ఆమోదించారన్నారు.
తాను సమర్పించిన లేఖపై సుమారు మూడేళ్లపాటు మౌనం వహించిన స్పీకర్, రాబోయే ఎన్నికల్లో టీడీపీ సభ్యుల సంఖ్యను తగ్గించాలన్న ఉద్దేశంతో రాజీనామాను అంగీకరించారని అన్నారు. బిజినెస్ రూల్ 186 ప్రకారం ఏ సభ్యుడి నుంచైనా రాజీనామా లేఖ అందితే తప్పని సరిగా స్పీకర్ లేదా ఆయన తరఫున ఏదైనా ఏజన్సీ ద్వారా విచారణ జరపాలని పేర్కొన్నారు. ప్రస్తుత విషయంలో ఈ విధానాన్ని పాటించకుండా నేరుగా రాజీనామాను ఆమోదిస్తూ దురుద్దేశంతో ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చారన్నారు.
రాజ్యసభ ఎన్నికల ఎత్తుగడ ! - టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదించిన స్పీకర్
స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ బాధ్యతలను తప్పక పాటించాలని, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయన రాజకీయ బంధాలకు ప్రభావితం కాకూడదన్నారు. స్పీకర్ నిర్ణయాలపై కోర్టులు న్యాయ సమీక్ష నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందన్నారు. మూడేళ్లపాటు మౌనంగా ఉండి, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, దురుద్దేశంతో హడావుడిగా రాజీనామాను స్పీకర్ ఆమోదించారని తెలిపారు.
స్పీకర్ ఉత్తర్వులను సస్పెండ్ చేయకపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని స్పీకర్ ఉత్తర్వులతోపాటు ప్రభుత్వం జారీచేసిన గెజిట్ ప్రకనటను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని గంటా కోరారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో పాల్గొనేలా, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన ఉత్తర్వులివ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు.
గంటా రాజీనామా విషయంలో మూడేళ్లు గాడిదలు కాశారా? - స్పీకర్, సీఎం జగన్‌పై బుచ్చయ్య చౌదరి ఆగ్రహం